iDreamPost
android-app
ios-app

అక్కడ విలవిల .. ఇక్కడ కళకళ .. ఇంతలో ఎంత మార్పు..?

  • Published Sep 07, 2021 | 5:39 AM Updated Updated Sep 07, 2021 | 5:39 AM
అక్కడ విలవిల .. ఇక్కడ కళకళ .. ఇంతలో ఎంత మార్పు..?

స్పర్ధయా వర్దతే విద్యా అంటారు. పోటీ పడి చదివితేనే విద్యకు రాణింపు. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు పోటీపడి వ్యాపారం చేస్తే ఎలా ఆఘోరిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. విద్యాబోధన పరమార్ధాన్ని గాలికి వదిలేసి మూడు స్కూళ్లు – ఆరు కాలేజీలుగా విస్తరిస్తున్న ధోరణికి అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకున్న సంకల్పం సత్ఫలితాలిస్తోంది. ఈ రెండేళ్లలో బడుల్లో డ్రాపు అవుట్స్ శాతం గణనీయంగా తగ్గింది. గత సర్కారు హయాంతో పోల్చి చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో 7.84 లక్షల చేరికలు పెరిగాయనేది విద్యాశాఖ రికార్డులు చెబుతున్న లెక్క.

సాహసోపేత నిర్ణయాలు.. చిత్తశుద్ధితో అమలు ..

పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, ఇంటిలో ఒకరు చదువుకుంటే కుటుంబం ఆర్ధికంగా నిలదోక్కుకుంటుది అన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ భావన. అందుకే పేదల పిల్లలను చదివించే బాధ్యతను తాను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాహసోపేతమైన పథకాలను ప్రారంభించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, మధ్యాహ్న భోజనం, విద్యాదీవెన, విద్యావసతి, మన బడి నాడు – నేడు వంటి పథకాలతో చదువుకొనే వయసు పిల్లలందరూ బడికి వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేసింది. పిల్లల చదువులో కీలక పాత్ర పోషించే తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేసే అమ్మ ఒడి, ఉన్నత చదువులకు పూర్తిగా ఫీజు రీయంబర్స్ మెంట్, విద్యార్థుల హాస్టల్ ఖర్చులకు ఏటా రూ. 20 వేలు చెల్లించడం వంటివి విద్యారంగంలో విప్లవాత్మక ప్రస్థానానికి మైలురాళ్లుగా నిలిచాయి.

కార్పొరేటును తలదన్నేలా..

మన బడి నాడు – నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసి కార్పొరేటు స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దారు. దీంతో పిల్లల ముఖ్యంగా అమ్మాయిల డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయి. ఈ పథకంలో రూ. 16,025 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని విద్యాసంస్టల్లో 10 అంశాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. మొదటి దశలో రూ. 3,669 కోట్లతో 15,715 పాఠశాలలను ఆధునీకరించి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అంకితం చేశారు. రెండో దశ పనులను ప్రారంభించారు. రూ. 4,535 కోట్లు ఖర్చయ్యే ఈ పనులు 2022 జులై నాటికి పూర్తి చేసి మిగిలిన పాఠశాలలను మూడో విడతలో 2023 జులై కల్లా ఆధునీకరిస్తారు.

Also Read : బాబూ..మీకు అర్థమవుతోందా.. ఏపీ అప్పులపై కేంద్రం సానుకూల స్పందన

చిత్తశుద్దితో అమలు..

డబ్బు కొద్దీ చదువు అనే కార్పొరేటు కల్చరుకు దూరంగా విద్యార్ధులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో, పక్కా ప్రణాళికతో, చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈ సంస్కరణలను అమలు చేయడం సత్ఫలితాలిస్తోంది. రెండేళ్లకే అంధ్రప్రదేశ్ విద్యారంగంలో గణనీయమైన మార్పు కనిపించి సానుకూల ఫలితాలు రావటం ఇటు తల్లిదండ్రులను, అటు పాలకులను ఉత్తేజ పరుస్తోంది.

ఆన్ లైన్లొనే కార్పొరేటు విద్య…

రాష్ట్రంలో సర్కారు బడులు విద్యార్థులతో కళకళలాడుతూ ఉండగా ప్రైవేటు బడులు, కార్పొరేటు స్కూళ్లు ఇంకా ఆన్ లైన్ తరగతులకే పరిమితం అయ్యాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లుగా మూతపడ్డ స్కూళ్లను తెరిచే సాహసం యాజమాన్యాలు చేయలేకపోతున్నాయి. ప్రభుత్వ బడులు గత నెల 16నే తెరుచుకున్నా ప్రైవేటు స్కూళ్లు 10 శాతం మించి పని చేయడం లేదు. కరోనా టైంలో 80 శాతం ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తీసేసి సొమ్ము మిగిలించుకున్న యాజమాన్యాలు ఇప్పుడు వారిని తిరిగి విధుల్లో రమ్మని అడుగుతున్నా పెద్దగా స్పందన లేదు. మళ్లీ ఎప్పుడయినా అర్ధంతరంగా తమను ఇంటికి సాగనంపరన్న భరోసా లేకపోవడంతో వారు వేరే ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు.

మరోపక్క చాలామంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు గుడ్ బై చెప్పి ప్రభుత్వ బడుల బాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించే అంశాలు ఉండడం ఈ ధోరణికి కారణం. ఒకప్పుడు రకరకాల ఉపాయాలతో, ర్యాంకుల ప్రకటనలతో విద్యారంగాన్ని శాసించిన యాజమాన్యాలు సీన్ రివర్స్ కావడంతో తలలు పట్టు కుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యా వ్యాపారం దివాలా తీస్తుందని ఆందోళన చెందుతున్నాయి. మరోపక్క సర్కారీ బడులు కాలర్ ఎగరేస్తున్నాయి.

Also Read : విశాఖ‌పై స్ప‌ష్ట‌మైన విజ‌న్ తో ఏపీ స‌ర్కారు ముందుకు..