Idream media
Idream media
తెలంగాణ రాష్ట్ర సమితి.. అదే టీఆర్ఎస్. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీ. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ మొదట్లో ఉనికి చాటుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 2009 గ్రేటర్ ఎన్నికల్లో అయితే.. కనీసం పోటీలో కూడా నిలబడలేకపోయింది. పోటీలో నిలబడలేని పరిస్థితి నుంచి అసలు తమకు పోటీయే లేదనే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగింది. దీని వెనుక సీఎం కేసీఆర్ అపారమైన కృషి, అకుంఠిత దీక్ష మహోన్నతమైనవి. రాష్ట్రాన్ని సాధించి ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్ఎస్.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తాచాటలేకపోయింది. అసెంబ్లీ సంగతి అటుంచితే హైదరాబాద్ లో పార్టీ ప్రస్తానం ఇలా సాగింది.
నాడు నాలుగో స్థానానికి..
ఉమ్మడి రాష్ట్రంలో 2002 జనవరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ఎన్నికల్లో టీఆర్ఎస్ నాలుగో స్థానానికే పరిమితమైంది. అప్పటికి పార్టీ పురుడు పోసుకుని కేవలం ఏడాది మాత్రమే. మేయర్ పదవికి ప్రత్యక్షంగా జరిగిన ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభావం చూపలేకపోయింది. కార్పొరేటర్, మేయర్ కు వేర్వేరుగా జరిగిన ఎన్నికల్లో మేయర్ కు 26,78,009 ఓట్లు పోలయ్యాయి. నాడు టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 3,62,119 ఓట్లతో మేయర్ పీఠం అధిరోహించారు. 3,40,585 ఓట్లతో రెండో స్థానంలో ఎంఐఎం అభ్యర్థి జుల్‌ఫికర్ అలీ, 2,23,233 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మూడో స్థానంలో ఉండగా.. కేవలం 62,591 ఓట్లు సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని నర్సింహా రెడ్డి నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. దీంతో పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. దీనిపై సమీక్ష జరిపి పార్టీ పటిష్టతకు అప్పటి నుంచే పునాదులు వేయడం ప్రారంభించారు.
ఉద్యమమే లక్ష్యంగా పోటీకి దూరం..
ఐదేళ్ల పాటు తీగల మేయర్ గా కొనసాగిన అనంతరం కొన్నాళ్లు జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. అనంతరం ఎంసీహెచ్.. జీహెచ్ ఎంసీగా రూపాంతరం చెందింది. 2009 నవంబర్ లో జీహెచ్ ఎంసీకి తొలి ఎన్నికలు నిర్వహించారు. అదే సమయంలో రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఉధృతంగా పోరాడుతోంది. దీంతో గ్రేటర్ పోరుకు ఆ పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లను సాధించుకుంది. తెలుగుదేశం 42 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ నాలుగు, ఎంఐఎం 43 స్థానాలు పొందగా, ఇతర పార్టీలు 6 స్థానాల్లో గెలుపొందాయి. మజ్లిస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ మేయర్ పీఠం పొందింది. ఒప్పందంలో భాగంగా రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్ ఆ పదవిలో కొనసాగింది. అనంతరం మలి రెండున్నరేళ్లు ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మేయర్ గా కొనసాగారు.
2016లో కారు దూకుడు…
రాష్ట్రం సాధించిన అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీపై దృష్టి సారించారు. తెలంగాణలో తిరుగులేని పార్టీగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. 2002లో నాలుగు స్థానాలు, 2009లో పోటీకి దూరంగా ఉన్న టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లోనూ బలంగా పునాదులు వేశారు. గల్లీ, బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా పార్టీని శరవేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకూ గ్రేటర్ లో సత్తా చాటిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు రచించారు. తన మాటలు, చేతల ద్వారా పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేశారు. ఫలితంగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు వేగాన్ని అందుకోవడం ఎవరి తరమూ కాలేదు. గత ఎన్నికల్లో 99 సీట్లతో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడింది. తమ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని నిరూపించుకుంది. కాంగ్రెస్, టీడీపీ నేతలను కూడా గులాబీ గూటికి చేర్చుకుని వేరే పార్టీ లేదనే స్థాయికి ఎదిగింది. ఇదిలా ఉండగా.. 2020 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అదే సత్తా చాటుతుందా..?