గ్రేటర్ పీఠం విజయలక్ష్మి ని వరిస్తే.., విజయారెడ్డిని దూరం పెట్టింది. గతంలోనూ ఆమె ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆమె ఆశ నిరాశే అయింది. పీజేఆర్ వారసురాలిగా ఉన్న గుర్తింపుతో ఈసారైనా మేయర్ పీఠం తననే వరిస్తుందన్న ధీమా అనుచరుల వద్ద కనబరుస్తూ వచ్చారు. కానీ టీఆర్ఎస్ అధిష్ఠానం పంపిన సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తే కానీ తెలియలేదు. ఆమెకు ఈసారి కూడా నిరాశే మిగిలిందని.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే ముందుగా పి. జనార్థన్ రెడ్డి గుర్తొచ్చేవారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకనేతగా, పీజేఆర్ గా ప్రజలందరికీ సుపరిచితుడు. ఖైరతాబాద్‌లో ఐదు సార్లు గెలిచిన ఘనత పీజేఆర్‌కే ఉంది. మాస్ లీడర్ గా ప్రజల్లో స్థానం పొందారు. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం వేదిక వద్ద 2007 డిసెంబర్‌లో హఠాన్మరణం పొందారు. అప్పటికి ఖైరతాబాద్ పునర్విభజన జరగలేదు. ఆయన వారసుడిగా 2008 ఉప ఎన్నికల్లో పి. విష్ణువర్ధన్‌రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఖైరతాబాద్ పునర్విభజన జరగడంతో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు విష్ణు ఆసక్తి కనబర్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సలీంపై విజయం సాదించి తండ్రి వారసత్వాన్ని నిలుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014, 2018లలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవిచూశారు. ఇదిలా ఉండగా, విష్ణు రాజకీయాల్లో కొనసాగుతుండగానే.. పీజేఆర్ వారసురాలిగా విజయారెడ్డి కూడా రంగ ప్రవేశం చేశారు.
ఖైరతాబాద్ పునర్విభజన అనంతరం 2009లో దానం గెలవగా, 2014 చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. జూబ్లీహిల్స్‌లో 2009లో విష్ణు గెలవగా, 2014లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఇదిలా ఉండగా పీజేఆర్ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయారెడ్డి కూడా ఆది నుంచీ ఖైరతాబాద్ పైనే దృష్టి సారించారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తన తండ్రి పోటీ చేసిన సీటు కాబట్టి ఖైరతాబాద్‌ను కేటాయించాలని కోరింది. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అంటూ అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయారెడ్డికి సీటు ఇవ్వలేదు. దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి అయినా ఇవ్వాలని విజయారెడ్డి కోరారు. కానీ పార్టీ నియమానుసారం ఆమెకు టికెట్ కేటాయించడం కుదరలేదు. దీంతో ఆమె శేరిలింగంపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించినప్పటికీ విజయం అందుకోలేకపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఆమె బరిలో నిలవడం వల్ల దానంకు పడాల్సిన ఓట్లు చీలిపోవడంతో పాటు టీడీపీ మద్దతుతో దిగిన బీజేపీ అభ్యర్థి చింతలరామచంద్రారెడ్డి విజయం సునాయసమైంది. విజయారెడ్డి సుమారు 20 వేల ఓట్లతో తన ఉనికిని చాటుకుని మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత స్వరాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో మేయర్ పీఠం తనకే దక్కుతుందని ఆశించారు. కానీ అధిష్ఠానం బొ్ంతు రామ్మోహన్ వైపు మొగ్గు చూపింది. అనంతరం టీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును ఆశించారు. ఆ ఆశ కూడా నెరవేరలేదు. దానం నాగేందర్‌కు అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో విజయారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు బుజ్జగించడంతో చివరకు దానంతో కలిసి పనిచేసేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. గత డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ సీటు మహిళకే రిజర్వ్ కావడంతో గతంలో తన కోరిక నెరవేర్చని అధిష్ఠానం ఈసారైనా కరుణించకపోదా.. అని విజయారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఓ దశలో మేయర్ రేసులో విజయారెడ్డి ముందు వరుసలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆమె కూడా అదే ధీమాతో ఉన్నారు. తీరా గురువారం జరిగిన మేయర్ ఎన్నికలో కేకే కుమార్తె విజయలక్ష్మి మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఈసారి కూడా విజయారెడ్డికి నిరాశే మిగిలింది. అలకబూనిన విజయారెడ్డి సమావేశంలో నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై మీడియాలో రాద్దాంతం జరగడం, టీఆర్ఎస్ ముఖ్యులు ఆమెతో ఫోన్ లో సంప్రదింపులు జరపడంతో ఆమె మళ్లీ సమావేశానికి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా పీజేఆర్ కు ఉన్న ప్రతిష్ఠతో తనకు సరైన ప్రాధాన్యం దక్కుతుందనకున్న ప్రతీసారీ ఆమెకు అధిష్ఠానం సారీయే చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.