iDreamPost
iDreamPost
ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ సాగించిన పోరాటాలతో చివరకు పీఠం దక్కించుకున్నారు. తీరా ఆరు నెలల గడవకముందే అప్పుడే పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. అందులోనూ కీలక నేతల నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్టానానికి తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఆదిలోనే అడ్డుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా వేస్తున్న అడుగులు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.
తొలుత నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ అధికార పార్టీలో కలకలం రేపింది. పార్టీ వైఖరికి భిన్నంగా పార్లమెంట్ వేదికపై మాట్లాడడంతో అంతర్గతంగా లుకలుకలున్నట్టు బయటపడింది. దానిపై సీరియస్ అయిన పార్టీ వెంటనే ఆయన వివరణ కోరడం, ఆయన నేరుగా సీఎంని కలిసి తన వాదన వినిపించారు. అయితే అంతటితో ఆ కథ ముగిసిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా హస్తినలో ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. వ్యక్తిగతంగా అన్ని పార్టీల నేతను పిలిచి ఆయన విందు ఏర్పాటు చేయడం విశేషంగా మారుతోంది. అందులోనూ దానికి వేదికగా కేవీపీ రామచంద్రరావు ఇంటిని నిర్ణయించడం ఆసక్తిరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న కేవీపీ ఇంట్లో, ఆయన వియ్యంకుడైన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విందు ఏర్పాటు చేయడం వెనుక కారణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విందుకి పలువురు బీజేపీ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం మరింతగా చర్చనీయాంశం అవుతోంది. అంతేగాకుండా పీఎంవోలోనూ, హోం మంత్రి అమిత్ షా ఆఫీసులోనూ వైసీపీ కీలక నేతల కన్నా రఘురామకృష్ణం రాజుకి ప్రాధాన్యత దక్కుతుందనే ప్రచారం వెనుక మతలబు ఏమిటన్నది కూడా అంతుబట్టని వ్యవహారంగా ఉంది. ఇలాంటి విందు ఏర్పాటు విషయంలో పార్టీ అధిష్టానానికి సమాచారం ఉందా.. లేదా అన్నది కూడా అర్థం కాని అంశంగా మారింది. వ్యక్తిగతంగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ పార్టీ ఎంపీగా ఆయన చేపట్టే కార్యక్రమాలు అధిష్టానానికి తెలియాల్సి ఉంటుంది.
అదే సమయంలో రఘురామకృష్ణం రాజు తర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వ్యక్తిగతంగా పీఎంతో భేటీ కావడం వెనుక కారణాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వాటన్నింటికీ మించి నెల్లూరు వ్యవహారం రసరంజకంగా మారుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేరుగా నెల్లూరులో మాఫియా నడుస్తోందంటూ వ్యాఖ్యానించడం ద్వారా పార్టీ పరువు తీశారనే అభిప్రాయం వినిపిస్తోంది. వాటిపై వెంటనే విజయసాయి రెడ్డి స్పందించారు. సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆనం స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న అంశం. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముంగిట ఇలాంటి పరిణామాలు పార్టీలో వేడిని రాజేస్తున్నాయి.
ఒకరి తర్వాత ఒకరుగా సీనియర్ నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీలో ఈ పరిణామాలు ఎటు మళ్లుతాయన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ప్రస్తుతం పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ నేతలంతా వివిధ పార్టీల నుంచి ఎన్నికలకు కొద్ది నెలల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్నవారే కావడం విశేషం. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఉన్న వారంతా అధినేత మీద విశ్వాసంతో సాగుతుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మాత్రం తమకు తోచినట్టుగా వ్యవహరించడం గమనార్హం. రఘురామకృష్ణం రాజు అయితే గతంలో వైఎస్సార్సీపీలో పనిచేసి, ఆతర్వాత బీజేపీ, టీడీపీ మీదుగా మళ్లీ జగన్ వద్దకు చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే రీతిలో వివిధ పార్టీలు మారి వైఎస్సార్సీపీ గూటిలోకి వచ్చారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా అదే రీతిలో పార్టీలో చేరారు. ఇలాంటి వలస నేతల మూలంగానే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర నేతలు కూడా ఇలాంటి పద్ధతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకు తగ్గట్టుగా జగన్ కఠినంగా స్పందించేందుకు సమయాత్తమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో నేతల తీరు ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం ప్రశ్న.