త్వరలో కేటీఆర్ సీఎం.. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎవరు.. బీజేపీ, ఎంఐఎంలతో టీఆర్‌ఎస్ వైఖరి ఏంటి..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారా..? దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గిన తర్వాత టీఆర్‌ఎస్‌లో ఒక రకమైన స్తబ్ధత, గందరగోళం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారా..? అంటే అవుననే అంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు.ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టిన కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఆదివారం జరగనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ కార్యవర్గం సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటుగా మంత్రులు, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు అందరికీ ఆహ్వానాలు పంపారు. పార్టీ పటిష్టత, రానున్న శాసనమండలి, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు వరకూ ఎంఐఎంను టీఆర్‌ఎస్ తన మిత్రపక్షంగానే పరిగణించింది. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ తమకు మిత్రపక్షం కాదని కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ టీఆర్‌ఎస్ తలపడింది. ఈ నేపథ్యంలో ఎంఐఎంతో పాటు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉండబోతుందన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, వరుస ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపైనా ఆయన దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి పైనా సీఎం మాట్లాడేందుకు అవకాశం ఉంది.రాజకీయంగా టీఆర్‌ఎస్ ఒంటరిగానే ముందుకు వెళుతుందంటూ ప్రకటించే అవకాశమూ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు వివాదాల జోలికి పోకుండా ప్రజల్లోనే ఉండాలన్న దానిపైనా సూచనలు చేస్తారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ శ్రేణుల నిరాశా, నిస్పృహలపైనా సీఎం కేసీఆర్ వద్ద ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ ఉందనీ చెబుతున్నారు. వీటినీ ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థి ఎవరన్నదీ కార్యవర్గ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే 2001లో పెట్టిన టీఆర్‌ఎస్ పార్టీకి 20 సంవత్సరాలు నిండుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభను ఘనంగానే నిర్వహించే అవకాశం ఉంది. ప్లీనరీ కూడా నిర్వహించవచ్చునంటున్నారు. దీనిపైనా సీఎం కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.