టోక్యో ఒలింపిక్స్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. క్రీడా ఈవెంట్లు ప్రారంభమైన తొలి రోజే భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం ద్వారా భారత్ తన పతకాల ఖాతాను తెరిచినట్లు అయింది.
49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం ఎనిమిది మంది తుది దశలో పోటీపడ్డారు. దీనిలో స్వర్ణ పతకాన్ని చైనాకు చెందిన హౌ జూహయ్ సొంతం చేసుకోగా సిల్వర్ పతకాన్ని ఇండియాకు చెందిన మీరాబాయి గెలుచుకున్నారు. కాంస్య పతకాన్ని ఇండోనేషియాకు చెందిన కంటిక్ విండే సాధించారు. మీరాబాయి చాను తన చివరి అటెండ్ లో 117 కేజీల బరువు ఎత్త లేకపోవడంతో సిల్వర్ కు పరిమితమయ్యారు. మీరాబాయి చాను 115 కేజీల బరువును రెండో అట్టెంప్ట్ లో ఎత్తడంతో, అది కొత్త రికార్డు అయింది. మొదటి అట్టెంప్ట్ లో 110 కేజీలు ఎత్తి ప్రత్యర్ధులకు సవాల్ విసిరిన మీరాబాయి చాను చివరి ప్రయత్నంలో మిస్ కావడంతో రజతపతకం మాత్రమే దక్కింది.
ఇప్పటివరకు మీరాబాయి వ్యక్తిగత లిఫ్టింగ్ 205 కిలోలు ఐతే, ఒలంపిక్స్లో రికార్డును చెరిపేసిన 210 కిలోల బరువును ఎత్తడం విశేషం.117 కిలోల చివరి బరువు ఆమె ఎత్తి ఉంటే మీరాబాయి విజయం సాధించి ఉంటే మొదటి రోజే ఇండియా అద్భుతమైన ప్రారంభాన్ని అందించినట్లు అయ్యేది. అయితే వెయిట్ లిఫ్టింగ్ లో అంతంత మాత్రంగానే ఆశలు పెట్టుకున్న ఇండియా మొదటిరోజే రజత పతకం సాధించడం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.
మణిపూర్కు చెందిన మీరాబాయి వెయిట్ లిఫ్టింగ్ లో మొదటినుంచి ప్రతిభ చూపిస్తున్నారు. 1998 సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకం సాధించడం ఇదే రెండోసారి. అప్పట్లో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి సిడ్నీ ఒలింపిక్స్లో పతకం సాధిస్తే మళ్లీ ఇన్నాళ్లకు మీరాబాయి చాను రజితం సాధించారు. 26 ఏళ్ల ఆమె నలభై ఎనిమిది కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించారు. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో పలు పతకాలను సాధించడంలో మీరాభాయి విజయం సాధించారు. 2016 ఆసియా క్రీడల్లో నూ ఆమె పతకాలను సాధించారు. 4.11 అడుగుల దేహంతో నిరంతరం వెయిట్లిఫ్టింగ్ సాధనలో మునిగితేలే ఆమె కు భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న ను కేంద్ర ప్రభుత్వం అందించి ప్రోత్సహించింది. అలాగే పద్మశ్రీ పురస్కారాన్ని మీరాబాయి చాను అందుకున్నారు.
వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ మొదటి రోజు మొదటి పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పతక విజేత మీరాబాయి చాను కు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో టోక్యో ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.