Idream media
Idream media
మార్చి 26, 1953న అమెరికాలోని సీబిఎస్ రేడియోలో మాట్లాడుతూ వైద్యుడు, జీవశాస్త్ర పరిశోధకుడు జోనాస్ సాల్క్ తను రూపొందించిన పోలియో వాక్సీన్ అన్ని ప్రాధమిక పరీక్షలను విజయవంతంగా అధిగమించింది అని చెప్పగానే రాత్రికి రాత్రే అమెరికా దేశంలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన రూపొందించిన ఆ వాక్సీన్ ఆ తర్వాత కాలంలో ఎందరో తల్లులు కడుపుకోత నుంచి మరెందరో పిల్లలను అంగవైకల్యం నుంచి, మరణం నుంచి కాపాడింది.
పురాతన కాలం నుంచి మానవాళిని పీడించిన మహమ్మారి
పోలియో జబ్బు చరిత్రకు పూర్వం నుంచే ఉందని క్రీస్తు పూర్వం నిర్మించిన ఈజిప్టు పిరమిడ్ల లోపల గీసిన బొమ్మలలో పోలియో సోకి అంగవైకల్యం పొందిన మనుషులు ఉండటం వల్ల తెలుస్తోంది. దాదాపు ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం ఎందరో పిల్లలకు సోకి, వారిలో కొందరిని బలితీసుకుని, మరెందరినో వికలాంగులుగా మారుస్తూ ఉండేది పోలియో వైరస్.
ఇరవయ్యవ శతాబ్దంలో జనాభా ఎక్కువగా క్రిక్కిరిసినట్టు జీవించే నగరాలు తయారయ్యాక పారిశుధ్య లోపం వలన పోలియో కేసులు పెరుగుతూ వచ్చాయి. 1952లో ఆ ఒక్క సంవత్సరంలోనే అమెరికాలో 58 వేలమంది పోలియో బారిన పడి, మూడు వేలమంది మరణిస్తే అంతకు మూడు నాలుగు రెట్లు వికలాంగులయ్యారు. అందుకే 1953లో జోనాస్ సాల్క్ చెప్పిన ఆ వార్త అతనికి అంత పాపులారిటీ తీసుకొచ్చింది.
పోటాపోటీగా రెండు రకాల వాక్సీన్లు
సాల్క్ ఒకవైపు పోలియో వైరస్ ని ఫార్మాల్డిహైడ్ తో నిర్జీవం చేసి, దానిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించి యాంటీబాడీస్ ఉత్పత్తి చేయాలని పిట్స్ బర్గ్ నగరంలో పరిశోధనలు చేస్తుండగా మరోవైపు పోలాండ్ లో జన్మించి అమెరికాకి వలస వచ్చిన వైద్యుడు, జీవశాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్ వైరసుని చంపకుండా నోటిద్వారా ఇవ్వడం వలన చవకగా, మరింత ప్రభావవంతమైన వాక్సీన్ రూపొందించవచ్చు అని న్యూయార్క్ నగరంలో పరిశోధనలు సాగిస్తున్నాడు.
యుక్తవయసులో ఉండగా పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుపడి ఆ తరువాత నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడు అయిన ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ 1938లో మార్చ్ ఆఫ్ డైమ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పోలియోతో పోరాటంలో నిధుల కొరత లేకుండా చేశాడు. రూజ్ వెల్ట్ వ్యక్తిగతంగా స్వంత నిధులు సమకూర్చడమే కాకుండా, ప్రభుత్వ నిధులు, విరాళాల రూపంలో సేకరించిన డబ్బులు రీసెర్చ్ కోసం వెచ్చించారు. ఈ సంస్థ మొదట్లో సాబిన్ టీకా మీద నమ్మకం పెట్టుకున్నా అది ఆలస్యం కావడం అదే సమయంలో సాల్క్ టీకా పురోగతి సాధించడంతో సాల్క్ పరిశోధనలకు ఆర్థికంగా సపోర్టు చేసింది. ఆర్థికపరమైన మద్దతు లభించడంతో సాల్క్ తన జట్టును పెంచుకొని పరిశోధనలు ముమ్మరం చేశాడు.
స్వంత కుటుంబం మీద ప్రయోగం
జులై 1952 లో తన ప్రయోగశాలలో జంతువుల మీద సాగించిన ప్రయోగాలు సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చాక, 1953లో మూడు పాఠశాలలను ఎంచుకొని అక్కడ పిల్లలకు టీకా వేసి, తన పిల్లలకు కూడా వేసి, తను కూడా వేసుకున్నాడు. 1954లో పది లక్షల మంది పిల్లలకు టీకా ఇచ్చారు. ఏప్రిల్ 12,1955న అమెరికా ప్రభుత్వం సాల్క్ వాక్సీన్ సురక్షితమని సర్టిఫికెట్ ఇచ్చింది.
పేటెంట్ తీసుకోలేదు
పోలియోతో పోరాటంలో సాల్క్ రూపొందించిన వాక్సీన్ బ్రహ్మాస్త్రం లాంటిదని రుజువు కావడంతో అన్ని దేశాలు వాడటం మొదలుపెట్టాయి. తన టీకాకు పేటెంట్ తీసుకుంటే బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుందని తెలిసినా అందుకు సాల్క్ నిరాకరించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకూ వాక్సీన్ అందాలన్న ఉద్దేశంతో , తను పేటెంట్ హక్కులు తీసుకుంటే అది వాక్సీన్ ధర పెరగడానికి కారణమవుతుందని సాల్క్ ఆపని చేయలేదు.
కొద్ది రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు,”ఈ వాక్సీన్ పేటెంట్ హక్కులు మీరు తీసుకోలేదు. ఇప్పుడు ఇది ఎవరి స్వంతం?” అని అడిగిన ప్రశ్నకు, “నా పరిశోధనకు విరాళాలు ఇచ్చిన ప్రతిఒక్కరికీ, వాక్సీన్ వేసుకుని ఇది సురక్షితం అని తెలియజేయడానికి ముందుకొచ్చిన ప్రతి బిడ్డకూ ఈ వాక్సీన్ స్వంతం. సూర్యుడి మీద ఎవరికీ పేటెంట్ ఉండదు. అలాగే ఈ వాక్సీన్ కూడా “అని సమాధానం ఇచ్చాడు జోనాస్ సాల్క్.
ఒక వెనకడుగు
కాలిఫోర్నియాలోని ఒక లాబొరేటరీ వాక్సీన్ రూపొందించే ప్రక్రియలో వైరస్ ని నిర్జీవం చేయడంలో చేసిన పొరపాటు వల్ల రెండు లక్షల మందికి సజీవంగా ఉన్న పోలియో వైరస్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. వీరిలో చాలా మందికి పోలియో సోకి, రెండు వందల మందికి అంగవైకల్యం సంభవించగా, పదిమంది మరణించారు. దీంతో సాధారణ ప్రజానీకానికి వాక్సీన్ అందడం ఒక సంవత్సరం ఆలస్యం అయింది. అయితే 1956లో వాక్సీన్ అందుబాటులోకి వచ్చాక 1957లో అమెరికా మొత్తమ్మీద ఆరువేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి.
సాల్క్ రూపొందించిన టీకా ఉపయోగించి చాలా దేశాలు పోలియోని అదుపు చేశాయి. 1962లో ఆల్బర్ట్ సాబిన్ రూపొందించిన చుక్కల రూపంలో నోటిద్వారా తీసుకునే వాక్సీన్ రష్యాలో లక్షలాదిమంది పిల్లల్లో సురక్షితం, ప్రభావవంతం అని తేలడంతో అమెరికా ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చింది. సాబిన్ వాక్సీన్ చాలా చవకైనది మాత్రమే కాకుండా, పిల్లలకి ఇవ్వడం కూడా తేలిక కావడంతో అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు సాబిన్ వాక్సీన్ వాడి పోలియోని తరిమికొట్టాయి.
భారతదేశంలో పోలియో టీకా
భారతదేశంలో 1978 నుంచి బాలబాలికలందరికీ పోలియో వాక్సీన్ ఇవ్వడం మొదలుపెట్టినా దేశమంతా కవర్ చేయడం కష్టంగా ఉండేది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా 1995లో పల్స్ పోలియో కార్యక్రమం మొదలుపెట్టారు. దాంతో పోలియో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టి జనవరి2011 లో దేశంలో ఆఖరి పోలియో కేసు గుజరాత్ రాష్ట్రంలో నమోదయింది. మూడు సంవత్సరాలు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో మార్చి 27,2014 న ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించింది.
ఆ రెండు దేశాల్లోనే పోలియో వైరస్ జీవిస్తోంది
గత సంవత్సరం నైజీరియా దేశాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో రహిత దేశంగా గుర్తించడంతో ప్రస్తుతం ప్రపంచంలో పోలియో జబ్బు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మాత్రమే ఉంది. మతపరమైన కారణాలతో పోలియో డ్రాప్స్ పిల్లలకు వేయించకపోవడమే ఇందుకు కారణం. పోలియో డ్రాప్స్ వేయడానికి వెళ్లే వాలంటీర్ల మీద దాడులు జరగడం ఆ దేశాల్లో సర్వసాధారణం. చాలా సార్లు వాలంటీర్లకు రక్షణగా పోలీసులు కానీ, సైన్యం కానీ వెళ్తుంది. అయినా తమ పిల్లలకు వాక్సీన్ వేయించడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో వాక్సీన్ వేయకుండానే తిరిగి రావలసి వస్తుంది.
ఆ రెండు దేశాల్లో కూడా ప్రజల్లో చైతన్యం వచ్చి ఒక సంవత్సరం పిల్లలందరికీ ఓరల్ పోలియో వాక్సీన్ వేయిస్తే స్మాల్ పాక్స్ వైరస్ మాయమైనట్టు పోలియో వైరస్ కూడా భూమి మీదనుంచి మాయమైపోతుంది.