ఏపీలో కలిసి పని చేస్తామని ప్రకటించిన బీజేపీ – జనసేన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీల నేతలూ పలు దఫాలు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. తాజాగా జరిగిన సమావేశంలో కూడా స్పష్టత రాలేదని తెలిసింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు పాల్గొనగా.. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ, జనసేన కలసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్ అన్నట్లు సమాచారం.
నడ్డాతో భేటీలోనూ..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో భేటీ అయ్యారు. అప్పుడు కూడా తిరుపతి సీటుపై నడ్డాతో పవన్ చర్చించినట్లు తెలిసింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే అక్కడ తమ అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ చెబుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గినందున తమకు తిరుపతి సీటు వదలాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. తిరుపతిలో జనసేనకు మంచి కేడర్ ఉందని, తిరుపతిలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే తిరుపతిలో తామే పోటీ చేస్తామని బీజేపీ కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. తిరుపతిలో జనసేన కేడర్, ఓటు బ్యాంకు బలంగా ఉన్నాయి. కాపు సామాజికవర్గం అండగా ఉంది. గత ఎన్నికల్లో జనసేకు మెరుగైన ఓట్లు వచ్చాయి. గతంలో చిరంజీవి అక్కడి నుంచి గెలుపొండదం జరిగింది. పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఉంది. మద్దతు కూడా ఉంది. ఇవన్నీ జనసేనకు ప్లస్ అవుతాయని, మెజార్టీ గెలుపు అవకాశాలు జనసేకు ఉంటాయి కనుక, ఆ స్థానాన్ని తమకు వదలాలని ప్రధానంగా పవన్ కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బీజేపీ కూడా.. తిరుపతి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చర్చలు ఇంకా కొలిక్కి రానప్పటికీ పోటీకి బీజేపీ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా తిరుపతిలోని స్థానిక అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. అక్కడ బలమైన కేడర్ ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో తామే పోటీ చెయ్యాలని స్థానిక నేతలు పార్టీ అధిష్ఠాన పెద్దలతో చెప్పినట్లు తెలిసింది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ సీటును వదులుకుంటే సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనసేనకు టికెట్ వదిలితే కనుక అది మైనస్ అవుతుందనే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పిన దానికే విలువ ఇస్తుందా..? మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కోరికను పరిగణణలోకి తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.