వచ్చే సంక్రాంతికి థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇస్తారో లేదో తెలియదు కానీ ఏ సినిమాలు విడుదలవుతాయో మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. రవితేజ క్రాక్ మాత్రమే ఈ విషయంలో సానుకూలంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా క్రేజీ కాంబోలో రూపొందిన మాస్టర్ ని ఎలాగైనా పొంగల్ పండగ సందర్భంగా విడుదల చేయమని నిర్మాతతో పాటు హీరో మీద కూడా అక్కడి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి తెస్తున్నారట. చిన్నా చితక సినిమాలు, హాలీవుడ్ మూవీస్ తమను సంక్షోభం నుంచి బయట పడవేయలేవని అందుకే మాస్టర్ లాంటి భారీ చిత్రమే రావాలని అడుగుతున్నారట.
అంతే కాదు ఒకవేళ ఒప్పుకుంటే తమిళనాడు మొత్తం 90 శాతం సింగల్ స్క్రీన్లు, మల్టీ ప్లెక్సుల్లో మాస్టర్ నే ప్రదర్శించడానికి హామీ ఇస్తారట. ఒకవేళ ఇంకెవరైనా పోటీకి వచ్చినా వారించేలా చేస్తామని చెబుతున్నారని చెన్నై టాక్. దీంతో ఇప్పుడు మాస్టర్ నిర్మాతతో పాటు హీరో కూడా పునరాలోచనలో పడ్డట్టు వినికిడి. ఓవర్ సీస్ లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి వేసవికి విడుదల చేయాలని ముందు అనుకున్న ప్లాన్. కానీ అప్పటిదాకా స్టార్ హీరోల సినిమాలు రాకపోతే థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడుతుందని విన్నవిస్తున్నారు. సో మాస్టర్ రిలీజ్ విషయంలో ఏర్పడ్డ సందిగ్దత ఇంకొద్ది రోజుల్లో తేలిపోవచ్చు.
నిజానికి మాస్టర్ కు చాలా భారీ ఓటిటి ఆఫర్ వచ్చింది. కానీ ప్రొడ్యూసర్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ఇప్పటికిప్పుడు ఇంత భారీ బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా మాస్టర్ ఒకటే. రజనీకాంత్ అన్నాతే ఇంకా చాలా బాలన్స్ ఉంది. ధనుష్ జగమే తంతీరం రెడీగా ఉంది కానీ అతనికి విజయ్ రేంజ్ మార్కెట్ కానీ ఎక్కువ రోజులు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కానీ లేదు. అందుకే మాస్టర్ నువ్వే శరణ్యం అంటూ పాటలు పాడుతున్నారు పంపిణీదారులు. ఇదే జరిగితే తెలుగులోనూ మాస్టర్ కున్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా భారీ వసూళ్లు దక్కించుకోవచ్చు. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.