వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతాంగం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం దేశ రాజధానిని చేరింది. ఛలో ఢిల్లీకి కార్యక్రమంలో భాగంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ల నుంచి ఢిల్లీకి బయలుదేరిన వేలాది మంది రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకుంది ప్రభుత్వం. హర్యానా దిల్లీ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి లాఠీలను, భాష్పవాయువును, వాటర్ క్యానన్ లను ప్రయోగించింది. అయినా వెనక్కితగ్గని వేలాది మంది రైతులు ఎముకలు కొరికే చలిలో ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నారు. సర్కారు సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
దాదాపు రెండు నెలల పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన రైతుల ఆందోళన ఇప్పుడు కేంద్రానికి సవాల్ గా మారింది. అయినా… ప్రభుత్వం మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. సమస్య పరిష్కారంపై కంటే, ఆందోళనను అణచివేయడంపైనే ఎక్కువ దృష్టిసారించింది కేంద్రం. ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రైతులతో చర్చించడానికి బదులు లాఠీచార్జి చేసి, వాటన్ కెనాన్ లను ప్రయోగించి వారిని వెనక్కిపంపేందుకు యత్నించింది.
చిత్తశుద్ధి ఏది?
ఎద్దేడ్సిన ఎవుసం… రైతేడ్సిన రాజ్యం బాగుపడదని సామెత. కానీ ఇవాళ అన్నదాత గోడు నింగినంటుతోంది. అయినా ఆలకించే వాళ్లు కనిపించడంలేదు. ఐదురోజులుగా వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు దేశ రాజధానిలో పడిగాపులు కాస్తుంటే దేశాధినేతలు మాత్రం పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పేరుతో దేశమంతా చెక్కర్లు కొట్టివచ్చారు. ఇక అమిత్ షా, సహా పలువురు కేంద్ర మంత్రులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించారు. కానీ రైతుల డిమాండ్లను వినడానికి వాళ్లకు సమయం చిక్కలేదు.
నాలుగు రోజుల తరువాత రైతులను బురారీ మైదానానికి చేరుకోవాలని, అక్కడే వారితో చర్చలు జరుపుతామన్న కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. బురారీ మైదానాన్ని బహిరంగ జైలుగా వర్ణించిన రైతు నేతలు ప్రభుత్వం కుట్రపూరితంగా బురారీ మైదానానికి రప్పించే ప్రయత్నం చేస్తోందన్నారు. షరతులతో కూడిన చర్చలు సానుకూల ఫలితాలివ్వవని తేల్చిచెప్పారు. ఓవైపు చర్చలకు రావాలంటూనే భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడూనీపై కేసు నమోదు చేయడాన్ని రైతు సంఘాలు తప్పుబట్టాయి.
బాధితులపైనే బండరాళ్లు
ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలు మాత్రం వ్యవసాయ బిల్లులపై పునరాలోచనకు సిద్ధమవడంలేదు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు కొత్త హక్కులు లభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు ఉద్ఘాటించారు. ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణల వల్ల రైతులకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. వ్యవసాయ బిల్లులు మూడూ పూర్తిగా రైతులు, వినియోగదారుల మేలు కోసమేనని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం ఉండడం రైతులకు ప్రయోజనకరమని.. ఈ-వర్తకం కూడా చేసుకోవచ్చని పాన్ కార్డ్ ఉంటే చాలని చెబుతున్నారు. కానీ రైతు సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలూ పూర్తిగా కార్పోరేట్ సంస్థలకే ప్రయోజనం చేకూర్చుతాయని వాదిస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులను ఖలిస్తానీ తీవ్రవాదులు రెచ్చగొడుతున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనల వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయని అన్నారు. ఇక వివాదాలకు కేంద్రంగా నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సైతం రైతుల ఆందోళనలను తప్పుబట్టింది. రైతులను జాతివ్యతిరేకులుగా పేర్కొంది. రైతులను విచ్ఛన్నకారులుగా అభివర్ణించిన ఆమె… రైతులు మరో షాహీన్ బాగ్ ను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వదని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకూ ఢిల్లీని వీడిపోమంటున్నారు రైతులు. సరిహద్దుల నుంచే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, హస్తినకు వెళ్లే ప్రధాన మార్గాలను మూసివేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 1న దేశ వ్యాప్త నిరసనలకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ నుంచి పిలుపు ఇచ్చింది. రాజధానిలో రైతుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుందో మరి.