iDreamPost
android-app
ios-app

“టెనెట్” దెబ్బ‌కి గ‌తం గుర్తుకొచ్చింది

“టెనెట్” దెబ్బ‌కి గ‌తం గుర్తుకొచ్చింది

అమెరికాలో సౌక‌ర్య‌వంత‌మైన థియేట‌ర్‌లో కాళ్లు చాపుకుని మెత్త‌టి రిక్ల‌యిన‌ర్ సుఖాన్ని అనుభ‌విస్తూ “టెనెట్” సినిమా చూశాను. అక్ష‌రం అర్థం కాలేదు. నిద్ర‌పోదామంటే ఆ సౌండ్‌కి నిద్ర‌రాదు. సాహో సినిమాలాగా ఎవ‌డు ఎవ‌న్ని ఎందుకు కాలుస్తాడో తెలియ‌దు. కాసేప‌టికి మెత్త‌టి సీటు కూడా Uneasy గా అనిపించింది. బ‌ట‌న్ నొక్కి చాపుకున్న కాళ్ల‌ని వెన‌క్కి లాగాను. త‌ర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఫోన్ చూసుకున్నా. ఇండియాలో ఇప్పుడే తెల్లారుతోంది. ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ గ్రూపులు ఇంకా నిద్ర లేవ‌లేదు.

మ‌నూర్లో అయితే ఈ బోర్ భ‌రించ‌లేక ఎవ‌డో ఒక‌డు పిల్లి కూత‌లు కూయ‌డ‌మో, ఏందిరా అయ్యా ఈ గోష్ట అని అరిచేవాడు. వీళ్లు కొంచెం మ‌ర్యాద‌స్తులు, భ‌రిస్తారు. థియేట‌ర్ మొత్తం ఆరుగురు ఉన్నారు. మేధావిత‌నం ముదిరితే పిచ్చి అవుతుంది. ఎవ‌డికీ అర్థం కాని సినిమా తీస్తే ఇలాగే జుత్తు పీక్కోవాలి. విష‌యం ఏమంటే థియేట‌ర్ బాగుండ‌డం కాదు, సినిమా బాగుండాలి. పాప్‌కార్న్ తిని కూల్ డ్రింక్ తాగ‌డం ఇంట్లో కూడా చేయొచ్చు. దానికి థియేట‌ర్ అవ‌స‌రం లేదు.

భూలోక న‌ర‌కం ఉంటుందో లేదో తెలియ‌దు. చిన్న‌ప్పుడు మేం చూసిన థియేట‌ర్లు, టెంటులు అన్నీ అవే. న‌ర‌కంలోనే సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం. రాయ‌దుర్గంలో రెండు థియేట‌ర్లు, రెండు టెంట్లు, ఒక్కోదానికి ఒక్కో క‌థ‌.

KB. ప్యాలెస్‌లో నేల‌మీద కూచుంటే సౌక‌ర్యం ఏమంటే గ్యారెంటీగా న‌ల్లులు కుట్ట‌వు. కాక‌పోతే ప‌క్క‌నున్న వాడి బీడీ మ‌న‌కు త‌గ‌లొచ్చు. ఒక్కోసారి వాడు మ‌న జేబులో ఉమ్మినా ఉమ్ముతాడు. కొత్త సినిమా అయితే స‌ర్వీస్ ఆటోలా ఎవ‌డి మీద ఎవ‌డు కూచుంటాడో తెలియ‌దు.

ఇక బెంచీకి వెళితే న‌ల్లులు మ‌న పిర్ర‌ల కోసం ఎదురు చూస్తుంటాయి. కూర్చోగానే గుంపులు గుంపులుగా మెరుపు దాడి చేస్తాయి. డ్యాన్స్ రాక‌పోయినా కూచిపూడి , క‌థాక‌ళి అన్నీ చేసేస్తాం. కొంత మంది ఈ బాధ భ‌రించ‌లేక కాగితాలు, సిగ‌రెట్ పెట్టెలు అంటించి బెంచీల సందుల్లో పెట్టేవాళ్లు. న‌ల్లుల్ని చంపుతూనే NTR క‌న‌ప‌డితే విజిళ్లు వేసేవాళ్లు. ఇక కుర్చీకెళితే (చాలా త‌క్కువ సార్లు) సీట్ల‌లోనే కొబ్బ‌రి పీచు త‌గిలి దుర‌ద పెట్టేది. కుర్చీ, బెంచీల్లో ఇంకో బోన‌స్ పాయింట్ ఏమంటే చీల‌లు బ‌య‌టికొచ్చి మ‌న చొక్కాల్సి, ప్యాంటుల్ని క‌రోనాలా గ‌ట్టిగా ప‌ట్టేస్తాయి. ప్ర‌తి రోజూ న‌లుగురైదుగురు ప్రేక్ష‌కులైనా చిరిగి పోయి వెళ్తారు.

ఇక అజీజియా థియేట‌ర్‌, దీంట్లో నేల లేదు. వీపుకి స‌పోర్ట్ లేని బెంచీ 40 పైస‌లు. స‌పోర్ట్ ఉంటే 75 పైస‌లు. రెండింటిలోనూ న‌ల్లులు బోన‌స్‌. బాల్క‌నీలో త‌క్కువ వుంటాయి. చీల‌ల ట్రీట్‌మెంట్ కామ‌న్‌. వాన‌లొస్తే టాయిలెట్లు శుభ్రం కావాల్సిందే (ఓపెన్ ఎయిర్‌). ప్ర‌త్యేక క్లీనింగ్ ఉండ‌దు. Two వ‌స్తే గేటు దూకి పారిపోవాల్సిందే. ఈ రెండు థియేట‌ర్ల‌లో కూడా మన కాళ్లు తొక్కుతూ కొంత మంది “ఎవ‌రిక‌య్యా సోడా, చెనిక్కాయ‌లు” అని అరుస్తూ తిరుగుతుంటారు. బాల్క‌నీలో అమ్ముతున్న‌ప్పుడు ఒక్కోసారి సినిమాకి బ‌దులు వీళ్ల నీడ‌లే క‌నిపిస్తూ వుంటాయి.

నూర్ టూరింగ్ టాకీస్‌, జ‌య‌ల‌క్ష్మి టాకీస్ ఇవి రెండు టెంటులు. రెండూ అధ్వాన్న‌మే. దీంట్లో నూర్ మ‌రీ అధ్వాన్నం. ఎండాకాలంలో రేకుల వేడికి ఒంట్లో నుంచి పొగ‌లొచ్చేవి. ఫ్యాన్లు ఉండేవి కానీ, పూన‌కం ప‌ట్టిన‌ట్టు త‌ల‌లూపుతూ తిరిగేవి. అవి ఊడి మీద ప‌డ‌తాయ‌నే భ‌యంతో వాటి కింద కూచునేవాళ్లు కాదు. క‌ర్ట‌న్లు ఎత్తేస్తారు కాబ‌ట్టి కొంచెం గాలి వ‌చ్చేది. ప్ర‌తి సినిమాకి ఐదారు ఇంట‌ర్వెల్స్ వుండేవి. రీల్ క‌ట్ అయితే అతికించాలి కదా. మంచి సీన్ న‌డుస్తూ వుండ‌గా వెన్నెల‌లా తెర మీద తెల్ల‌టి వెలుగొచ్చేది. లైట్లు వేసేవాళ్లు. జ‌నం ఈల‌ల‌తో నిర‌స‌న ప్ర‌క‌టిస్తూ బ‌య‌టికి పోయేవాళ్లు. ఈ టెంట్ల‌కి No Toilets. బ‌య‌టంతా ఖాళీ స్థ‌ల‌మే.

జ‌య‌ల‌క్ష్మి టాకీస్‌లో అయితే రీళ్లు వెనుకాముందు వేసి తిక‌మ‌క పెట్టేవాళ్లు. ఆప‌రేట‌ర్‌కి కోపం వ‌స్తే మ‌ధ్య‌లో ఒక రీల్ లేపేసేవాడు. జ‌నం ఆనందంగా చూసేవాళ్లు. దీని బ‌య‌ట చిన్న‌చిన్న పాక హోట‌ళ్లు ఉండేవి. అక్క‌డ తిర‌గ‌మోత వేస్తే టెంటులో ద‌గ్గులు వినిపించేవి.

డిస్ట్రిబ్యూట‌ర్ల ద‌గ్గ‌ర మిగిలిపోయిన రీళ్ల‌ను తెచ్చి సినిమాల‌ని చూపించే వాళ్లు. మ‌ధ్య‌లో అనేక గీత‌లు వాన కురిసిన‌ట్టు క‌నిపించేవి. మంచి పాట వ‌చ్చిన‌ప్పుడు సోడాలోడు వ‌చ్చి కుయ్యి మ‌ని ఎక్స‌ట్రా మ్యూజిక్ వినిపించేవాడు.

ఇన్నింటిని త‌ట్టుకుని సినిమాని ప్రేమించాం. విజిళ్లు వేశాం. ఏడ్చి న‌వ్వాం. న‌వ్వి ఏడ్చాం. రాక్ష‌సుల్ని దేవ‌త‌ల్ని చూసింది ఇక్క‌డే. మాంత్రికుల్ని రాజ‌కుమారుల్ని ఈ తెర‌లపైన్నే చూశాం. యువ‌రాణిని చూసి మ‌న‌సు పారేసుకున్నాం. జ్యోతిల‌క్ష్మి డ్యాన్స్ వ‌స్తే వెర్రి చూపులు చూశాం. నేల మీద , చెక్క బెంచీల మీద 3 గంట‌లు కూచున్నాం.

ఇప్పుడు థియేట‌ర్ల‌లో AC ఉంది. రిక్ల‌యిన‌ర్లు ఉన్నాయి. కానీ బాల్యం అమాయ‌క‌త్వం లేదు. వ‌య‌సు , తెలివి ఇవి రెండూ మ‌నిషికి శాపాలు.