iDreamPost
android-app
ios-app

ఆదివారం వరకూ అంతే, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే

  • Published May 21, 2020 | 1:03 PM Updated Updated May 21, 2020 | 1:03 PM
ఆదివారం వరకూ అంతే, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే

ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు తోడుగా వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోహిణీ కార్తెకు ముందుగానే మండిపోతున్న వాతావరణం అందరినీ కలవరపరుస్తోంది. దాంతో రాబోయే మూడు రోజుల పాటు జాగ్రత్తలు పాటించాల్సిందేనని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎవరూ అవసరం లేకుండా అడుగు బయటపెట్టవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ సడలింపులతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం రోడ్డు మీదకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గమనిస్తుంటే అంతా భద్రంగా ఉండేందుకు జాగ్రత్తలు అవసరం అని చెబుతున్నారు.

ఇప్పటికే అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులుగా క్రమంగా పెరుగుతున్న వేడి తీవ్రత ప్రస్తుతం 45 డిగ్రీలకు చేరిపోయింది. అనేక చోట్ల సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతుండడం కలవరపరుస్తోంది. రెంట చింతలలో అయితే 47.5 డిగ్రీలకు చేరింది. విశాఖ, ఏలూరు, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తాజాగా రాబోయే 5 రోజులకు సంబంధించి వాతావరణ హెచ్చరికలతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బులిటెన్ జారీ చేసింది. 25వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని తెలిపింది. తగు జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలిపింది. రోహిణీ కార్తె ఈనెల 25 న ప్రారంభం కాబోతోంది. ఆతర్వాత కొంత మార్పులు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈనెలాఖరు వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతున్న తరుణంలో తగు జాగ్రత్తలు అందరూ పాటించాల్సిందే నని ప్రభుత్వం చెబుతోంది.