విషయం ఏదైనా.. వెదికేదైనా… రెండు తెలుగు రాష్ట్రాలది దాదాపు ఎడమొహం పెడమొహమే..! దీన్కికి రాష్ట్రం విడిపోయిన తీరు ఒక కారణమైతే .. నేతల మధ్య ఉన్న విభేదాలు మరోకారణం. ఐతే ఆర్ధిక సంఘం సిఫార్సుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు ఒకే మాటపై నిలబడ్డాయి. నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలనే ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీనికి కారణం ఏమయ్యుంటుంది? అసలు ఆర్ధిక సంఘానికి రాష్ట్రాలకు ఏమి సంబంధం? ఆర్ధిక సంఘం విధులేంటి ? తదితరాల గురించి చూద్దాం ….
నిధుల బదలాయింపు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక సంబంధాలను వివరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ద్వారా
1951లో ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు అన్నీ ఉంటాయి. ఆర్ధిక సంఘం పన్నులు, ఇతరత్రా మార్గాల్లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీచేసేందుకు అవసరమైన విధానాన్ని రూపొందిస్తుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు మార్చ్ 31తో ముగియనున్నాయి. దీంతో ప్రస్తుతం 15 ఆర్ధిక సంఘం సిపార్సులపై అన్నిరాష్ట్రాలు దృష్టిసారించాయి.
15 ఆర్ధిక సంఘం..
ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ఎన్ కే సింగ్ అధ్యక్షతన 2017లో 15వ ఆర్ధిక సంఘం ఏర్పాటైంది. దీని గడువు 2019, అక్టోబర్ 30 కాగా, దేశ ఆర్ధిక, రాజకీయ మార్పుల కారణంగా ఆర్ధిక సంఘం నిర్దేశిత సంయమయంలో నివేదికను సమర్పిచలేకపోయింది. దీంతో గడువును 2020, అక్టోబరు 30 వరకు పొడిగించారు. ఐతే 14వ ఆర్ధిక సంఘం సిపార్సులు మార్చ్ 31తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి గాను ఆర్థిక సంఘం తన మొదటి నివేదికను అందించింది. ఇందులో ప్రాథమికంగా 14 ఆర్ధిక సంఘానికి భిన్నంగా ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని తెలుస్తోంది. ఐతే తుది నివేదిక మాత్రం భిన్నంగా ఉంఉండనుందనే వార్తల నేపథ్యంలో రాష్టాల్లో ఎక్కడాలేని భయాలు మొదలయ్యాయి.
ఆ లెక్కలే కావాలంటున్న దక్షిణాది..
రాష్ట్రాల పునర్విభజన, పార్లమెంటులో ప్రాతినిధ్యం తదితరాలకు 1971 జనాభా లెక్కలను 2001 వరకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. జనాభా నియంత్రణ, కుటుంభం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేసి ప్రగతిశీల రాష్ట్రాలుగా నిలిచినా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు నష్టపోకుండా 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 జనాభా లెక్కలను 2026 వరకు పొడిగించారు. ఐతే తాజాగా 15వ ఆర్ధిక సంఘం 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సిఫార్సు చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏ జరుగుతోంది..
అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్ధిక సంఘం అధ్యక్షుడు చెప్తున్నప్పటికీ ఆయన వైపు దక్షిణాది రాష్ట్రాలు అనుమానంగా చూస్తున్నాయి. బీహార్ కు చెందిన ఎన్ కె సింగ్ తన సొంత రాష్ట్రానికి లబ్ది చేకూర్చేలా 2011 జనాభాలెక్కల ప్రాతిపదికన నిధుల పంపిణీకి సిఫార్సు చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు వాడైనా వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్ధిక సంఘం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచితే… 15వ ఆర్ధిక సంఘం మాత్రం రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టేలా ప్రవర్తిస్తుండటంతో తీవ్ర వివాదాస్పదం అవుతోంది.