Idream media
Idream media
తెలంగాణలో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్, ఎంసీ సంతోష్ కూడా కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చే. కట్టడిలో భాగంగా ఈ నెల 30 వరకు తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగనుందా? లేదంటే మినీ లాక్‌డౌన్ లేదా పూర్తి లాక్ డౌన్ విధించనున్నారా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రత తగ్గకపోవడంతో వైరస్ ఉధృతిని అదుపులోకి తెచ్చేందుకు నైట్ కర్ఫ్యూ కొనసాగించడం, లేదంటే మినీ లాక్‌డౌన్ విధించడమో తప్ప ప్రత్యామ్నాయం లేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మినీ లాక్‌డౌన్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపితే అది వారం రోజుల పాటు విధించే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఆంక్షలపై విచారణ జరుపుతున్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీ, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీజీపీ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్లు నివేదికలను సమర్పించారు. అయితే ఈ నివేదికపై కోర్టు వాటిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30తో రాత్రి కర్ఫ్యూ ముగియనుండటంతో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏమిటో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ ఈ అంశంపై నైట్ కర్ఫ్యూ ముగియనున్న 30వ తేదీనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని న్యాయస్థానానికి తెలిపారు. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ /లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు చెప్పాలన్న ధర్మాసనం, ఈ ఒక్క అంశం కోసం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వం అడుగులు పడే అవకాశాలున్నాయని అంటున్నారు.
మే 14వ తేదీన రంజాన్ పండుగ, తర్వాత పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో కఠిన ఆంక్షలు విధించకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు కూడా ఆంక్షల నడుమ రంజాన్ పండుగ జరిగింది. దాంతో ఈ ఏడాది కూడా భౌతికదూరం పాటించేలా ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం కోరే అవకాశాల్లేకపోలేదు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ లేదు. అయితే పరీక్షలు చేయకపోయినప్పటికీ కేసులు తీవ్రంగానే ఉన్నాయనే ఆందోళన ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.