iDreamPost
iDreamPost
చంద్రబాబు యూటర్న్ వ్యవహారాలపై గతంలోనే జాతీయస్థాయిలో చర్చ జరిగింది. చివరకు ప్రధాని నేరుగా పార్లమెంట్ లోనే ప్రస్తావించారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ధోరణి అలా ఉందని కొందరు సర్థి చెప్పుకున్నారు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినా బాబు తీరులో మార్పు లేదని స్పష్టమవుతోంది. పదే పదే అనేక అంశాల్లో యూటర్న్ తీసుకోవడం ఆయన అలవాటుగా మార్చుకున్నట్టు అర్థమవుతోంది. తాజాగా స్వరూపానంద విషయంలోనూ టీడీపీది అదే ధోరణి, తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనిని, ఇప్పుడు వ్యతిరేకించేందుకు వారు వెనుకాడడం లేదు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కు సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2016లోనే కీలక ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన జన్మదినం నాడు వివిధ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అప్పట్లో దేవాదాయశాఖను బీజేపీ నేత మాణిక్యాలరావు నిర్వహించగా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వమే ఈ ఉత్తర్వులు ఇచ్చిన విషయం గమనార్హం.
అదే పంథాలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను టీడీపీ నేతలు తప్పుబట్టడమే విస్మయకరంగా మారింది. తాము చేసింది ఒప్పయితే, నేటి ప్రభుత్వానిది తప్పెలా అవుతుందన్నది టీడీపీ నేతలకు పట్టడం లేదు. తాము చేసిందంతా కరెక్ట్ అని, ఎదుటి వాళ్లు చేసిందానిపై విమర్శలకు దిగడమే విస్మయకరం. అప్పట్లో మంత్రిగా ఉన్న సమయంలో యనమల రామకృష్ణుడు శారదా పీఠాన్ని సందర్శించి ఆశీస్సులు పొందారు. ఎంపీలుగా పనిచేసిన మురళీమోహన్, కేశినేని నాని కూడా ఆశ్రమానికి వెళ్లి వచ్చారు.
అలాంటి టీడీపీ నేతలు అప్పట్లో తాము ఆచరించిన విషయాలన్ని జనం మరచిపోవాలని ఆశించడమే విడ్డూరం. పైగా స్వరూపానందకు వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా క్యాంపు ప్రచారానికి పూనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన గతంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని స్వరూపానంద మీద మీమ్స్ వేస్తున్న తీరు విశేషంగా కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీ నేతలు తాజా ఎపిసోడ్ తో స్వరూపానందకు వ్యతిరేకంగా తమ గళం శృతి పెంచేందుకు ప్రయత్నంలో ఉన్నారని భావించాల్సి వస్తోంది.