కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు సుపరిచితం. టీడీపీ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. అధికార పార్టీని, నేతలను ఉద్దేశించి.. అసభ్యపదజాలం ఉపయోగించే పట్టాభి.. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌పైనా అదే తీరును కొనసాగించి.. కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇంటిపై దాడులు, పోలీసు కేసులు, అరెస్ట్, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు.. అటు బెయిల్‌పై విడుదలయి మనశ్శాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. కొద్ది రోజుల్లోనే చాలా జీవితం చూశారు పట్టాభి.
అనకూడని ఒక్క మాట అని.. జీవితంలో దాదాపు అంతా చూశాడు పట్టాభి. అందుకే మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని గట్టిగా అనుకున్నట్లుగా ఉన్నారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన పట్టాభి.. ప్రభుత్వం నిర్వహించిన ఇసుక టెండర్ల అంశంపై విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు.. అత్యంత జాగ్రత్తగా పట్టాభి మాట్లాడాడు. దూకుడు మాటలు, పరుష పదజాలం ఎక్కడా ఉపయోగించలేదు. ఏకవచనంతో సంబోధనలు లేవు. ప్రెస్‌మీట్ ఆసాంతం సర్.. ముఖ్యమంత్రిగారు.. అంటూ సంబోధించారు. ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో తనలో మునుపటి దూకుడు తగ్గిందని టీడీపీ శ్రేణులు ఎక్కడ అనుకుంటాయోనన్న ఆందోళన పట్టాభిలో కనిపించింది. తాను మునుపటిలాగే ఉన్నానని చాటుకునేందుకు యత్నించారు.
మొత్తం మీద టీడీపీ అధికార ప్రతినిధి అయిన పట్టాభిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఇది పట్టాభితోపాటు అందరికీ మంచిదే. అనవసరమైన వివాదాలు తలెత్తవు. మంత్రి కొడాలి నాని అన్నట్లు జీతం కోసం పని చేసే పట్టాభి కూడా ఈ తీరును కొనసాగిస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. బాస్ మెప్పు కోసమో, చెప్పారనో మాట జారితే దాని పర్యవసానాలు కూడా తానే ఎదుర్కొవాల్సి వస్తుందని పట్టాభికి బాగా అవగతమైంది. ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి. పాలనలో లోపాలను ప్రతిపక్షం ఎత్తిచూపాలి. రాజకీయం ఇలా సాగితే.. రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. మరి పట్టాభిలో వచ్చిన మార్పు శాశ్వతంగా ఉంటుందా..? లేదా..? అనేది చూడాలి.
Also Read : JC Prabhakar Reddy Hug, Paritala Sriram – జేసీ రాజకీయం.. ఆత్మీయమా..? అవసమంచిదే