బహుశా సామెతలని మార్చి రాయాల్సిన రోజులు వచ్చాయి అనుకొంటా . నాడు రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేవారు . నేడు ప్రజాధనం టీడీపీ నాయకుల పాలు అనాలేమో.
నిన్న అమరావతి రాజధానిగా ఉంచాలన్న పోరాటంలో చంద్రబాబు మాట్లాడుతూ హైటెక్ సిటీ కట్టకముందు తాను ఆ ప్రాంతంలో ఎకరా లక్ష చొప్పున కొన్నానని హైటెక్ సిటీ కట్టిన తర్వాత అదే భూమిని 30 కోట్లకి అమ్మానని అంటే మూడు వేల రేట్లు అధిక ధర వచ్చిందని సంపద సృష్టి అంటే అదనీ చెప్పుకొచ్చారు.
మంచిది , ప్రజల మేలు కోసం నేతలు అభివృద్ధి చేయటం , సంపద సృష్టించటం ఎవరికైనా ఆమోదయోగ్యనీయమే . కానీ ప్రజాధనంతో చేసే ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు చెందాలి కానీ అభివృద్ధి చేసిన ప్రభుత్వంలోని అధినేతలకు , ఇతర నాయకులకు , వారి బినామీలకు , బంధు మిత్ర వర్గ పరివారాలకు చెందరాదు . అది ప్రజాద్రోహమే కాదు నేరం కూడా.
ఈ విధమైన ఆర్ధిక నేరాలు ఇంసైడర్ ట్రేడింగ్ చంద్రబాబుకు కొత్తేమి కాదు, చేయి తిరిగిన విద్య అనేది జగద్విదితం . ఈ రోజు చంద్రబాబు చెప్పినట్టు హైటెక్ సిటీ దగ్గర వారే కాదు వారి సహచరులు , అనుచరులు , బినామీలు ముఖ్యంగా జయభేరి వారు సాగించిన రియల్ ఎస్టేట్ దందా ఎవరికి తెలీదు . హైటెక్ సిటీ నిర్మించాలి అన్న ఆలోచన రాగానే ప్రకటనకు ముందే అక్కడి రైతుల భూముల్ని అత్యంత చవకగా కొనేసి వారిని మోసం చేసి ఆ రైతుల నోట్లో మట్టి గొట్టిన దారుణ కృత్యం ఇంసైడర్ ట్రేడింగ్ కాక మరేమవుతుంది . ఆవేశంలో చంద్రబాబు ఒప్పుకున్న నిజం పై తెలంగాణా ప్రభుత్వం విచారం జరపాలి.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి నాలుగొందల ఎకరాల ఐ ఎం జీ భూములు బిల్లీ రావుకి అడ్డ కూలీకి కట్టబెట్టి చంద్రబాబు చేసింది ఆర్థిక నేరమే అవుతుంది. నూరు ఎకరాల రహేజా భూములు , ఎమ్మార్ ప్రాపర్టీస్ కి చెందిన ఏడు వందల ఎకరాల భూములు , కాకినాడ పోర్ట్ భూములు రెండు వందల ఎకరాలు ఇలా ఎక్కడ చూసినా చంద్రబాబు లోపరికారిగా చేసిన భూ పందేరాలు కనపడుతుంటే ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి వారి ధనాన్ని అస్మదీయులకు పందేరం చేసి ప్రయోజనాలు పొందినట్టు కళ్ళకి కట్టినట్టు అర్థమవుతుంటే రాజధానిలో మాత్రం ఇంసైడర్ ట్రేడింగ్ లేదు అంటే నమ్మశఖ్యం కాదు.
సరే అవన్నీ గతాలు అనుకున్నా ఇక్కడ రాజధానిలో మాత్రం చంద్రబాబు చేసిందేంటి? రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, అనుయాయులు బినామీ పేర్ల మీద కొన్న భూములు పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన నెలకే రాజధాని ప్రకటనకు కొద్దీ నెలల ముందే హెరిటేజ్ పేరిట కంతేరులో కొన్న 14.22 ఎకరాల భూమి గురించి రాజధాని ప్రాంత రైతులకు సమాధానం చెప్పాలి. ముప్పై కోట్ల సంపద లెక్క ప్రకారం రైతులకు చెందాల్సిన 426.6 కోట్ల సంపదను చంద్రబాబు అడ్డంగా దోచుకొన్నట్టు కాదా ???
దేశంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా పార్టీకి భూమి కట్టబెట్టే విధంగా చట్టాన్ని మార్చి టీడీపీకి అణాకానీ రేటుకి నాలుగెకరాల స్థలం కేటాయించుకొన్న విషయంలో చంద్రబాబు అభివృద్ధి రేటు ప్రకారం 120 కోట్ల రూపాయల రైతుల సొత్తు లాక్కున్నట్లు కాదా?
ఇహ చంద్రబాబు , అప్పటి మంత్రులు మరియు వారి అనుయాయులు బినామీ పేర్లతో కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4075 ఎకరాలు నిగ్గు తేలితే 122250 అక్షరాల లక్షా ఇరవై రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ స్కామ్ కళ్ళ ముందు కదలాడుతూ భీతి గొలుపుతుంది.
రాజధాని కట్టి లబ్ది పొందితే నిజమైన రైతులు పొందాలి కానీ , రాజకీయం , అధికారం ముసుగులో రైతుల పొట్ట గొట్టే సంఘ విద్రోహ శక్తులకు లబ్ది చేకూరకూడదు . అందునా ఇలాంటి కబ్జా దారుల లబ్ది కోసం వారి భూముల విలువ పెంపుదల కోసం లక్ష కోట్లు ప్రజాధనం వెచ్చించి అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వమ్ దివాళా పరిస్థితికి పోయి విష నాగుల్ని పోషించాల్సిన పని లేదు.
ఎవరైతే నిజంగా భూములిచ్చిన రైతులున్నారో గుర్తించి , రాజధానికి ఎంతమేర భూమి తీసుకొంటారో ప్రకటించి మిగతాది సాగు యోగ్యంగా చేసి తగు పరిహారంతో రైతులకు అప్పచెప్పి వారు అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉంది.