iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మళ్లీ నోరు పారేసుకున్నారు. గతంలో సీఎంపై రాయలేని భాషలో అనాగరికంగా మాట్లాడి వైఎస్సార్ సీపీ కేడర్, అభిమానుల ఆగ్రహానికి గురైన పట్టాభిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆదివారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికి సీఎం అయితే ఏ విధంగా దోచుకుంటారో జగన్ ప్రత్యేక్ష ఉదాహరణ అని అన్నారు.
ఆధారాలు చూపకుండా అభాండాలు..
ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు అంటూ జగన్మోహన్ రెడ్డి అభిమానులను రెచ్చగొట్టే పద ప్రయోగాలతో అవినీతి ఆరోపణలు చేస్తున్న పట్టాభి అందుకు తగిన అధారాలు చూపకుండా మాట్లాడారు. మూడేళ్ల పాలనలో అనేక రకాల స్కామ్‌లు చూశామని చెప్పడమే తప్ప ఎక్కడ? ఎప్పుడు? ఏ అంశంలో ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందో చెప్పలేదు. ఇసుక, మద్యం, మైనింగ్ ఇలా దేనిని వదిలిపెట్టలేదని ఆరోపించారే తప్పితే వాటిలో నిర్దిష్టత లేదు. వివిధ స్కామ్‌ల ద్వారా రూ. వేలకోట్లు దిగమింగారు అంటూ సీఎం జగన్ పై స్వీప్ కామెంట్లు చేశారు. ఇసుక, మద్యం, మైనింగ్ లో ఎక్కడ ఏ విధంగా జగన్ దోచుకున్నారో పేర్కొనలేదు. మూడేళ్లలో రూ. వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తినేస్తే మీ పచ్చ బ్యాచ్ ఇన్నాళ్ళూ ఎందుకు ఊరుకున్నారు? అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై అవినీతి అరోపణలు చేసేటప్పుడు అందుకు తగిన అధారాలు చూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని అంటున్నారు.
అవగాహన లేని విమర్శలు..
వారానికి మూడుసార్లు పిల్లలకు పంచే చిక్కీలో కూడా కక్కుర్తి పడ్డారని పట్టాభి విమర్శించారు. చిక్కీ సరఫరాకు గతేడాది రూ.136 కోట్లు ఉన్న టెండర్‌ను ఈ ఏడాది అమాంతం రూ.198 కోట్లకు పెంచేశారని చెప్పి ఆయన తన అవగాహన లేమిని బయట పెట్టుకున్నారు. జగనన్న సంపూర్ణ పోషణ కింద అంగన్వాడీ కేంద్రాలలో అందించే చిక్కీలు వారానికి మూడుసార్లు అందించే మాట వాస్తవమే కాని రాష్ట్రవ్యాప్తంగా ఆ కేంద్రాలలో ప్రతి నెలా పిల్లల సంఖ్య పెరుగుతుంది. అలా పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఏటా బడ్జెట్ పెరుగుతుంది. ఒక్క చిక్కీలే కాకుండా బియ్యం, చోడిపిండి, నూనె బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుంది. పిల్లల సంఖ్య, పెరిగిన ధరల ఆధారంగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే సొమ్ము పెరుగుతుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా అవినీతి జరిగిపోయింది అని ఆరోపణలు అదీ సీఎంపై చేయడం బురద చల్లడంకాక మరేమిటి?
రెచ్చగొట్టడమే ఎజెండా..
ప్రధాన ప్రతిపక్షంగా తన ఘోరమైన పనితీరుతో విఫలమైన టీడీపీ అధికార పార్టీని రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకుంది. గంజాయి రవాణాలో, డ్రగ్స్ వ్యాపారంలో, గుడివాడ క్యాసినోలో సీఎంకు వాటాలున్నాయి అంటూ అడ్డగోలు విమర్శలు చేస్తోంది. పసలేని టీడీపీ అవినీతి ఆరోపణలను అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో సీఎంను కించపరిచేలా అనాగరిక భాషను వాడుతూ జగన్మోహన్ రెడ్డి అభిమానులను రెచ్చగొట్టాలని చూస్తోంది. ఎంతటి ఆరోపణలనైనా ఆధారాలతో సరళమైన భాషతో చేయవచ్చు. అలాకాకుండా నాయకుడికి తక్కువ, కార్యకర్తకు ఎక్కువ అయిన కొమ్మారెడ్డి పట్టాభి లాంటి వారితో రెచ్చగొట్టే రాజకీయం చేయడం తగదని వైఎస్సార్ సీపీ నేతలు హితవు పలుకుతున్నారు.