iDreamPost
iDreamPost
ఇంట్లో నడిచే ఓపిక లేనివాడు పరుగు పందేనికి వెళతానన్నట్టు ఉంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాట తీరు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తనకు ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయని భావిస్తుంటే వెంటనే 151 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసరడం ఉత్తర కుమార ప్రగల్భాలను గుర్తుకు తెస్తున్నాయి. ఆయన తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేసేశారు.
కామెడీ చేస్తున్నది ఎవరు?
బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపుపై వైఎస్సార్సీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తున్నదని ఎద్దేవా చేశారు. 90వేల పైచిలుకు ఓట్లతో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్ సీపీ సంబరాలు చేసుకోకపోతే డిపాజిట్ కోల్పోయిన బీజేపీ, దానికి మద్దతుగా నిలిచినా ఓటమిని నివారించలేక పోయిన టీడీపీ చేసుకుంటాయా? ఏ ఎన్నికల వచ్చినా ఏ వంక చూపి పోటీ నుంచి తప్పుకుందామా అని తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచన చేస్తుంటే బుద్దా చేసిన ఈ వ్యాఖ్యలు కామెడీ కాక మరేమిటి? ఎన్నికలంటేనే వెన్నులో వణుకు పుట్టబట్టే కదా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బద్వేల్ ఉప ఎన్నికల్లో సైతం ముందుగా అభ్యర్థిని ప్రకటించి కూడా పోటీ చేయకుండా పారిపోయారు కదా.. అయినా బద్వేల్ ఎన్నికల్లో మీ పార్టీ, మీ రహస్య మిత్ర పార్టీ జనసేన కలసి బీజేపీకి రకరకాలుగా సాయపడ్డా ఉమ్మడిగా చతికల పఢ్ఢారు కదా. మరొపక్క 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సిపి తిరుగులేని విజయాలు సాధిస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే తమరు సవాళ్లు చేయడం నవ్వు పుట్టించదా?
ఆ యాత్రను భగ్నం చేయడం ఎందుకు?
అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర భగ్నానికి కుట్ర చేస్తున్నారని యాత్రకు ఆటంకం కలిగినా, రైతులకు ఏదైనా జరిగినా అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే బాధ్యుడవుతాడని హెచ్చరించారు. మూడు రాజధానులపై విస్పష్టమైన ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. అందుకనుగుణంగా పనిచేస్తున్నారు కూడా. కొన్ని గ్రామాలకే పరిమితమైన ఆ ఉద్యమాన్ని టీడీపీ, దాన్ని సపోర్ట్ చేసే మీడియా తప్ప ఏడాదిగా రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మహా పాదయాత్ర అంటూ ఆ ఉద్యమ ఉనికిని నిలిపేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తున్న సంగతి జగమెరిగిన సత్యం. అలాంటి పాదయాత్రను భగ్నం చేసే అవసరం ఎవరికి ఉంటుంది. తెలుగునాట
ఉద్యమాలను భగ్నం చేయడం, కృత్రిమ ఉద్యమాలకు ఊపిరి పోయడంలో పేటెంట్ మీ పార్టీదే కదా..
దోచుకున్నది ఎవరో జనానికి తెలియదా?
ప్రజల నుంచి దోచుకుంటున్న సొమ్ముతోను, అప్పుల ద్వారా సమకూర్చుకుంటున్న ధనంతోను వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాలని జగన్మోహన్‌రెడ్డి, పీకే ప్రణాళికలు వేసుకుంటున్నారు. జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ప్రతిసారీ పీకేని, జగన్‌నే నమ్మరు అని బుద్దా వ్యాఖ్యానించేశారు. గతంలో పీకే వ్యూహాలకు రాష్ట్ర ప్రజలు పడిపోయినా.. ఈసారి ఆయన పప్పులేమీ ఉడకవన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో దోచుకొని, దాచుకుందని జనం భావించ బట్టే ఇప్పటికి కూడా ఈసడించుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పథకం సొమ్ముని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తుంటే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే జనం నమ్ముతారా? జగన్, పీకేలను కలిపి విమర్శించిన తీరును బట్టే మీరు, మీ పార్టీ వారంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. వారిని ప్రజలు నమ్మకపోతే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీరు ఊహిస్తున్నట్టు జనం మీ విష ప్రచారాలు నమ్మరు. ఎవరిని గెలిపించాలి అనే దానిపై వారికి ఎప్పుడూ స్పష్టమైన అవగాహన ఉంటుంది.