Idream media
Idream media
తరిమెల అమరనాథరెడ్డి , ఈ పేరు అనంతపురంలో సుపరిచితం. ముఖ్యంగా పేద ప్రజలకి. ఆయనేం రాజకీయ నాయకుడు, అధికారి కాదు. అంతకంటే ఎక్కువ. ప్రాణాలు అపాయంలో ఉన్న వాళ్లకి రక్తాన్ని అందిస్తారు. మానవత సంస్థ నిర్వాహకులు. దశాబ్దాలుగా ఆయన ఈ పని చేస్తున్నాడు. వైద్యానికి డబ్బులు లేక కష్టాల్లో ఉన్న పేద వాళ్లకి ఆయన ఫోన్ నెంబర్ ఓ సంజీవని.
ఆయన ఊరు తరిమెల. దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నారు. పదవుల్ని వదులుకుని పేదల పక్షాన పోరాటం చేసిన తరిమెల నాగిరెడ్డి ఊరు అది. తరిమెల అనే పేరే పేదలకి నమ్మకాన్ని ఇస్తుంది. అందుకే అమర్ తన ఊరిని ఇంటి పేరుగా మార్చుకున్నారు. (1976లో నేను టెన్త్ చదువుతున్నాను. ఒక రోజు సప్తగిరి సర్కిల్ నుంచి ఆస్పత్రి వరకూ వందల మంది పేదవాళ్లు ఏడుస్తూ పరిగెత్తడం చూశాను. ఏమైందని అడిగితే తరిమెల నాగిరెడ్డి చనిపోయాడని చెప్పారు. ఆయన జనం మనిషి)
అమర్నాథరెడ్డి ఈ మధ్య మూడు పుస్తకాలు తెచ్చాడు.
అమర్ హ్యూమర్ , అమర్ హార్ట్, అమర్ టాక్స్. వీటి ప్రత్యేకత ఏమంటే ఈ పుస్తకాలకి ముందు మాటల్ని వాటిని టైప్ చేసిన DTP ఆపరేటర్లు రాయడం.
ముందుగా అమర్ హ్యూమర్ గురించి చెప్పాలి. ఆయనకి సెన్సాప్ హ్యూమర్ ఎక్కువ. ఆయనతో మాట్లాడుతుంటేనే నవ్వుతూ ఉంటాం. అయితే ఆ హ్యూమర్‌లో కూడా Depth ఉంటుంది. సామాజిక స్పృహ ఉంటుంది. Readers digest పత్రికలో Humour in real life అనే కాలమ్ వచ్చేది. అంటే సృష్టించిన జోక్స్ కాకుండా , జీవితంలోనే ఎదురయ్యేవి. దీంట్లో కూడా ఆయన రోజువారీ జీవితంలో ఎదురయ్యేవి. నిజానికి ఆయన దగ్గర 10 పుస్తకాల మెటీరియల్ ఉంటుంది. అందులో కొన్నింటిని ఒక పుస్తకంగా వేసినట్టున్నారు.
చింతతోపులో దెయ్యాలున్నాయని పుకారు ఎందుకు పుట్టిస్తారంటే , రాత్రిపూట చింతకాయల దొంగతనం జరగకుండా ఉండడానికట!
శివరాత్రి జాగారం చేసినోళ్లంతా కైలాసానికి పోయే మాట నిజమైతే అక్కడంతా పేకాట రాయుళ్లే ఉంటారట.
అనేక చమత్కారాలు, రక్తదాన అనుభవాలు, ప్రెస్ నిర్వహణలో హాస్యం, మూఢనమ్మకాలపై విసుర్లు మొత్తం 246 హాస్య సంఘటనలు.
అమర్ హార్ట్ కొంచెం సీరియస్ పుస్తకం. మున్నాభాయ్ MBBS సినిమాలోలా వైద్యంలోని డొల్లతనం , అమానుషం, పేదవాళ్ల నిస్సహాయత ఇవన్నీ అక్షరాల్లో కనిపిస్తాయి. అర్ధరాత్రి ఫోన్లు, అరుదైన రక్తం కోసం అగచాట్లు, ప్రొసీజర్స్ పేరుతో డాక్టర్ల నిర్లక్ష్యం అన్నీ కనిపిస్తాయి. ఆయన మాటల్లో అనంతపురం యాస మాత్రమే కాదు, సామాజిక స్థితులు, నిస్సహాయమైన పేదరికం అన్నీ ఉంటాయి.
ఒకసారి ఒక రోగికి కాలు పుండైతే , కాలు తీసేయడానికి రూ.15 వేలు అవుతుందని డాక్టర్ చెబుతాడు. అంత డబ్బు లేక అతను వైద్యం చేయించుకోడు. పుండు మాని కాలు బాగవుతుంది. డబ్బులు లేకపోవడం వల్ల నీ కాలు నీకు మిగిలింది అని అతనితో అంటాడు అమర్. హాస్యం వెనుకున్న విషాదం.
రక్తం కావాలని ఒక పల్లెటూరాయన ఫోన్ చేస్తాడు. ఏం గ్రూప్ అని అడిగితే మాది తాడిపత్రి, దివాకర్‌రెడ్డి గ్రూప్ అంటాడు. రక్తం దానంతో ప్రాణాలు కాపాడుకున్న వాళ్లు తమ పిల్లలకి అమర్నాథ్ అని పేరు పెట్టుకుంటే ఆశ్చర్యమేం లేదు.
మూడో పుస్తకం అమర్ టాక్స్. అనంత జిల్లాలోని ఫ్యాక్షన్ స్వభావం, పేదల్లోని మూఢ నమ్మకాలు, సమాజంలోని అన్ని విషయాలపై రచయిత ప్రత్యక్ష కథనం, లేదా వ్యాఖ్యానం ఉంటాయి.
ఈ రక్తదాన ఉద్యమంలో ఆయనకి చేదోడుగా సలీంమాలిక్ పనిచేస్తున్నారు. హ్యూమర్‌తో ఎలా నవ్వులు విరజిమ్ముతాయో అదే విధంగా అమర్ హార్ట్ చదువుతుంటే బాధగా కూడా అనిపిస్తుంది. కనీస వైద్యం అందుకోలేని పేదరికం, ఆస్పత్రుల్లోని నిరాదరణ కళ్లు తడి చేస్తాయి.
ఈ పుస్తకాల్లో గొప్ప రచనా శిల్పం, భాష లేవు కానీ, ఉన్నదంతా జీవితం. అద్దం లాంటి నిజాయితీ. అదే మనల్ని ఆకట్టుకుంటుంది. ఆత్మ ఉంటే అలంకారాలు అక్కర్లేదు.
విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ల్లో ఇది లభిస్తాయి.