iDreamPost
android-app
ios-app

ఏ కూటమికి తమిళుల ఓటు

ఏ కూటమికి తమిళుల ఓటు

కరుణానిధి, జయలలిత వంటి సినీ, రాజకీయ దిగ్గజాలు లేకుండా తొలిసారిగా తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్‌ జరగనుంది. 3,998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6.29 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం నమోదుచేసిన తమకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టం కడతారని డీఎంకే ఆశిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉండగా, మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడులో ఐదు కూటములు బరిలో నిలిచాయి. నేడు ఓటర్లు ఏ కూటమికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.

ఎన్‌డీఏ కూటమిలో 10 పార్టీలు ఉండగా.. అందులో పీఎంకే (23), బీజేపీ (20) తప్ప మిగిలిన పార్టీలన్నీ అన్నాడీఎంకే చిహ్నంపైనే పోటీ చేస్తున్నాయి. అన్నాడీఎంకే 179 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిత్రపక్షాలతో కలిపి ఆ పార్టీ గుర్తుపై 191 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డీఎంకే కూటమిలో 13 పార్టీలు ఉండగా ఆ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ (25 స్థానాలు), సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే తలా ఆరేసి స్థానాల్లో, ఐయూఎంఎల్‌ 3 స్థానాల్లో బరిలో నిలిచాయి. కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం 157 స్థానాల్లో, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం 165 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఎన్నికల కమిషన్‌ పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. 1.5 లక్షల మంది పోలీసులను మోహరించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను, పోలింగ్‌ సామగ్రిని ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు తరలించింది.

ఇదిలా ఉండగా, 126 మంది సభ్యులు అస్సోం అసెంబ్లీకి మూడు విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా.. మంగళవారం తుది దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈశాన్య భారతంలో బీజేపీ అగ్రనేత, రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్‌కుమార్‌ దాస్‌ సహా 337 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్‌డీఏకు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. అలాగే 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎనిమిది దశలుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు ముగిశాయి. మంగళవారం మూడో దశలో 31 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. పాలక టీఎంసీకి కంచుకోటలైన హౌరా, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఈ సీట్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌-లెఫ్ట్‌-ఐఎస్‌ఎఫ్‌ కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ జరుగుతోంది.