iDreamPost
iDreamPost
ఇరవై నాలుగేళ్ళ క్రితం చిన్న సినిమాగా విడుదలై పెద్ద హీరోలు సైతం షాక్ తినేలా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పెళ్లిసందడి మరోసారి తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కామీడియాతో కలిసి స్వీయ పర్యవేక్షణలో రాఘవేంద్రరావు దీన్ని నిర్మించబోతున్నారు. అయితే దర్శకుడు ఈయన కాదు. ఆ బాధ్యతను అసిస్టెంట్ గౌరీకి అప్పజెప్పారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతోంది. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి యాక్టింగ్ వర్క్ షాప్ హైదరాబాద్ లో జరుగుతోంది. కీలకమైన హీరోయిన్ సెలక్షన్ ఇంకా జరగలేదు. కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ కొత్తమ్మాయిని సెట్ చేయబోతున్నారట.
ఇందులో మరికొన్ని స్వీట్ సర్ప్రైజులు ఉంటాయని తెలుస్తోంది. రోషన్ తో పాటు మరో ఇద్దరు కుర్ర హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్. వాళ్ళు ఎవరనే పేర్లు మాత్రం బయటికి రాలేదు. రోషన్ నాలుగేళ్ల క్రితం నిర్మలా కాన్వెంట్ తో డెబ్యూ చేశాడు. అది ఫెయిల్ కావడంతో కొంత గ్యాప్ ఇచ్చారు తల్లితండ్రులు. సరైన కం బ్యాక్ తో రావాలని ఇంతకాలం ఎదురు చూశారు. శ్రీకాంత్ ని ఓవర్ నైట్ లో స్టార్ చేసిన పెళ్ళిసందడి కంటే మంచి సబ్జెక్టు వేరొకటి ఏముంటుందని భావించి వెంటనే ఓకే చెప్పేశారు. ఇందులో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా తండ్రి క్యారెక్టర్ లోనే.
అయితే పెళ్లిసందడి కోసం పాత కథనే మళ్ళీ వాడుకుంటారా లేక ఫ్రెష్ స్టోరీని సిద్ధం చేశారా తెలియాల్సి ఉంది. అప్పట్లో రెండుంపావు గంటల సినిమాలో తొమ్మిది పాటలు పెట్టినా జనం విసుక్కోలేదు. పైగా కీరవాణి అద్భుతమైన సంగీతానికి పరవశించి పోయారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి మాయాజాలం సాధ్యమవుతుందా అంటే ఏమో చెప్పలేం. అసలే ఇవి ప్రేమాలయం రోజులు కాదు. ఐదు పాటలు పెట్టడమే గగనమైపోతోంది. ఇంత గ్యాప్ తర్వాత కీరవాణి కూడా ఆ స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వగలరా అంటే ఏమో మరి. అందులోనూ ఇప్పటి తరహానికి పెళ్ళిసందడి మీద ఏమంత క్రేజ్ లేదు. సో దీన్ని ఫ్రెష్ గా ట్రీట్ చేసి ప్లాన్ చేసుకోవాల్సిందే తప్ప ఆ కల్ట్ క్లాసిక్ ఇమేజ్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు