iDreamPost
iDreamPost
ఎస్వీబీసీ చానెల్ విస్తరణ జరుగుతోంది. మంగళవారం సీఎం జగన్ చేతుల మీదుగా హిందీ, కన్నడ భాషల్లో చానెల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దాంతో చాలాకాలంగా కేవలం తెలుగు చానెల్ తో పాటుగా తమిళంలో మాత్రమే నడుపుతున్న శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్ ప్రసారాలు ఇప్పుడు ఉత్తర భారత వాసులకు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. అదే సమయంలో కన్నడిగులకు కూడా తిరుమల వెంకటేశ్వరుని కార్యక్రమాలు మరింత చేరువకాబోతున్నాయి.
వైఎస్ కుటుంబం పట్ల టీటీడీ విషయంలో పలు వివాదాలను సృష్టించే ప్రయత్నం విపక్షాలు నిత్యం చేస్తూనే ఉంటాయి. గతంలో కూడా అనేక అపోహలు సృష్టించి వారి చుట్టూ వివాదాలు రాజేసిన చరిత్ర ఉంది. కానీ తెలుగులో తొలి 24గంటల భక్తి చానెల్ గా ఎస్వీబీసీని ప్రారంభించిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో 2008 జూలై 7 న ప్రసారాలు ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దికాలానికే తమిళంలో కి ప్రసారాలు ప్రారంభించింది.
Also Read : జగన్.. ఒక్క పిలుపు చాలు..!
ఇతర భాషల్లో కూడా ఈ చానెల్ ప్రారంభించాలనే డిమాండ్ పలుమార్లు ముందుకొచ్చింది. కానీ చివరకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయంలో దానికి శ్రీకారం పడింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి సారధ్యంలో ఎస్వీబీసీ ప్రసారాలు మరో రెండు భాషల్లో మొదలుకావడం భక్తులకు ఆనందాన్నిస్తోంది. ప్రధానంగా కన్నడ నేల నుంచి లక్షల సంఖ్యలో వెంకటేశ్వరుని దర్శనాల కోసం వచ్చే వారికి నిత్యం తిరుమల కొండలపై జరిగే కార్యక్రమాలను నేరుగా వీక్షించే అవకాశం రావడం సంతోషకరమని చెబుతున్నారు. ఉత్తరాదికి చెందిన హిందీ బెల్ట్ ప్రజలకు కూడా ఎస్వీబీసీ ప్రసారాలు సొంత భాషలో ప్రారంభం కావడం ఆనందాన్నిస్తోంది.
మంగళవారం శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని కూడా సీఎం జగన్ దర్శించుకున్నారు. తర్వాత ఆలయంలోని తులాభారం మొక్కు కూడా తీర్చుకున్నారు తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎస్‌వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను జగన్ ప్రారంభించడంతో కొత్త ప్రస్థానం మొదలయ్యింది.
Also Read : విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ : ఎంపీని కలవడం ఇక ఈజీ..!
గతంలో తండ్రి ఆధ్వర్యంలో ఎస్వీబీసీ మొదలుకాగా ఇప్పుడు తనయుడు చేతుల మీదుగా మరింతగా విస్తరించడంతో టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల విశిష్టతను ఇంటింటికీ చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న చానెల్ పలు భాషాల్లో సాగడం తిరుమల స్వామి వారి కీర్తిని పెంచడానికి దోహదపడతాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.