Idream media
Idream media
విజయవాడ రమేష్ ఆస్పత్రికి సుప్రిం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ అగ్రిప్రమాద ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రిం అనుమతిచ్చింది. ఆస్పత్రిపై తదుపరి చర్యలను నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
రమేష్ ఆస్పత్రి విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది పేషంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన స్వర్ణ ప్యాలెస్ యజమాన్యం, రమేష్ ఆస్పత్రిపై కేసులు నమోదు చేసిన ఏపీ పోలీసులు రమేష్ ఆస్పత్రి ఉన్నత సిబ్బంది ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారి బెయిల్‌పై బయట ఉన్నారు. రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేష్‌బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.
ముందస్తు బెయిల్‌తోపాటు, ప్రమాద ఘటనపై విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని వారు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై తదుపరి విచారణను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు పూర్తి చేసిన సుప్రిం కోర్టు రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌గా నిర్వహించిన స్వర్ణ ప్యాలెస్ అగ్రిప్రమాద ఘటనపై విచారణ జరిపేందుకు అనుమతిచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. అయితే రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమానులను అరెస్ట్ చేయకుండా దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ..దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఎలా స్టే ఇస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతివాది రమేష్ ఆస్పత్రి తరఫున వాదించిన న్యాయవాది.. దర్యాప్తు ఆపాలన్నది తమ వాదన కాదని, బలవంతపు చర్యలు తీసుకోకూడదనే తాము హైకోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. ఇరు వైపు వాదనలు విన్న జస్టీస్ నారీమన్ నేతృత్వంలోని సుప్రిం ధర్మాసనం.. దర్యాప్తు కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.
సుప్రిం ఆదేశాలతో ఏపీ పోలీసులు స్వర్ణప్యాలెస్ ఘటనపై దర్యాప్తు తిరిగి ప్రారంభించనున్నారు. ఫైర్ సేఫ్టీ లేకుండానే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్‌ను నిర్వహించారని, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.