రిజర్వేషన్స్…భారత్‌లో ఎప్పుడూ చర్చనీయాంశమే…! సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పుతో మరోసారి రిజర్వేషన్స్‌పై చర్చ ప్రారంభమైంది. కాకపోతే ఇది రిజర్వేషన్లు సబబా, కాదా అనే విషయంపై కాదు. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న కులాలు, రిజర్వేషన్ ఫలాలు అందుకోవటంలో ఆయా కులాల్లోని అంతర్గత అసమానతలు, రిజర్వ్‌డ్ కులాల జాబితా సంస్కరణలపై కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేసు నేపథ్యం ఏమిటి? అనే విషయాలతోపాటు తీర్పుపై వినిపిస్తున్న అనుకూల, ప్రతివాదనల గురించి తెలుసుకుందాం…..
సుప్రీంకోర్టు తీర్పు సారాంశం
రిజర్వుడు కులాల్లో కొన్ని వర్గాలు, ప్రజలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుకుకొని సంపన్నులుగా మారారు. దీంతో ఆయా కులాల్లో నిరాదరణకు గురైన వారిలో తీవ్ర ఆవేదన ఉంది. ఇది వారి మధ్య ఘర్షణకు దారితీస్తోంది. కాబట్టి ప్రభుత్వం రిజర్వుడు కులాల జాబితాలో మార్పులు చేయాలి. ప్రభుత్వం నియమించిన కమిషన్లు కూడా జాబితా నుంచి కొన్ని కులాల తప్పించి…కొత్తవాటిని చేర్చాలని సూచించాయి. కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి, అయితే దీని కోసం రిజర్వేషన్ కోటాలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు…..ఇదీ సుప్రీంకోర్టు తాజా తీర్పు సారాంశం.
కేసు నేపథ్యం
షెడ్యూల్డ్ ఏరియాల్లో(గిరిజన ప్రాంతాలు)ని టీచర్ ఉద్యోగాలను 100 శాతం షెడ్యూల్డ్ కులాల(ఎస్టీలు) వారితో భర్తీ చేసేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఈ కేసుకు ప్రధాన కేంద్రంగా ఉంది. పూర్వపరాల్లో కెళ్తే ఏపీ ప్రభుత్వం 1986లో తొలిసారి ఈ తరహా జీవో తీసుకొచ్చింది. కానీ దాన్ని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ రద్ద చేసింది. దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం…1998లో దాన్ని విరమించుకుంది. అనంతరం 2000,జనవరిలో జీవో ఎం.ఎస్.నం.3/2000 ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీలతో భర్తీ చేసేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు ఇది పూర్తి అసంబద్ధమని…ఈ చర్య చట్టం ముందు అందరూ సమానులే(ఆర్టికల్ 14), పౌరుల మధ్య వివక్ష చూపరాదు(అధికరణ 15(1)), సమాన అవకాశాలు(ఆర్టికల్ 16) అనే భావనకు వ్యతిరేకమని పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వ జీవో ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాల్సిన అవసరం లేదని…భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు చెల్లవని తీర్పుచెప్పింది.
అనుకూల వాదన….
దేశంలో 1000కిపైగా షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), 700కు పైగా షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ ఫలాలను కొన్ని కులాలే అందుకుంటున్నాయనే వాదన చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ వాదనలో నుంచి పుట్టిందే ఉమ్మడి ఏపీలో ఎస్సీ కులాల వర్డీకరణ వాదన. అయితే ఈ వర్గీకరణ వాదం రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదాస్పదమైంది. ఎస్సీల్లో మాల, మాదిగ కులాలు రిజర్వేషన్స్ అందుకోవడంలో మెరుగ్గా ఉండగా, రెల్లి, మాలదాసులు తదితర కులాల వారు వెనకబడి ఉన్నారు. దీనిపై ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకున్పప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ప్రతికూల వాదన….
‘రిజర్వేషన్లు’ పేదరిక నిర్మూలనా పథకమో, కార్యక్రమమో కాదని, దామాషా పద్ధతిలో ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధానమని…ఇందులో క్రీమిలేయర్ పేరుతో చొరబడటం మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ధనికుల పేరుతో ఎస్సీ, ఎస్టీల్లోని కొంత మందికి రిజర్వేషన్లు నిరాకరిస్తే… కేటాయించిన పోస్టులను దక్కించుకోవడంలో ఆయా వర్గాలు విఫలమవుతాయనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే బ్యాక్‌లాగ్ పోస్టులు సంఖ్య పెద్ద ఎత్తున ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
పార్లమెంటుదే అధికారం…
సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేయాలని సుప్రీంకోర్టు సూచించడం ఇదే మొదటిసారి కాదు. ఇంధిరా సుహాని కేసు, రాకేశ్ మిశ్రా కేసు సందర్భంగా ఇదే విధంగా వ్యాఖ్యానించింది. అయితే రిజర్వేషన్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ అంశంపై రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే….!