iDreamPost
android-app
ios-app

కథ స్క్రీన్ ప్లే మాటలు – రజనీకాంత్ – Nostalgia

  • Published Sep 29, 2020 | 1:51 PM Updated Updated Sep 29, 2020 | 1:51 PM
కథ స్క్రీన్ ప్లే మాటలు – రజనీకాంత్ – Nostalgia

స్టార్ హీరోలు నటించడమే కాదు దర్శకత్వం చేయడం కథలు రాయడం మరీ సాధారణం కాదు కానీ అరుదుగా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్ని అద్భుతమైన ఆణిముత్యాలు ఇచ్చారో చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే కృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి డైరెక్ట్ చేసి తన మల్టీ టాలెంట్స్ ని నిరూపించుకున్నారు. కథలు ఇచ్చిన హీరోలు లేకపోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అశ్వద్ధామకు స్టోరీ రాసింది నాగ శౌర్యనే. అయితే గతంలో రజనీకాంత్ ఓ సినిమాకు కథ స్క్రీన్ ప్లే రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. 1993లో ప్రతిష్టాత్మక విజయ సంస్థ తమిళంలో ‘వల్లి’ తీసింది. రజని స్నేహితుడు నటరాజ్ దర్శకత్వంలో ప్రియరామన్ ని హీరోయిన్ గా పరిచయం చేయగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 

దీనికి ఒరిజినల్ వెర్షన్లో కథ స్క్రీన్ ప్లే మాటలు అన్నీ రజనీకాంత్ రాశారు. కేవలం 7 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయడం విశేషం. ఇక కథేంటో చూద్దాం. ముఖ్యమంత్రి కొడుకు(సంజయ్) చదువుకున్న ఓ పల్లెటూరి అమ్మాయి వల్లి(ప్రియరామన్)ని ప్రేమించి వశం చేసుకుని ఆ తర్వాత మోసం చేసి మొహం చాటేస్తాడు.దానికి  వల్లి అతనతో పెళ్లికి బదులు చేసిన తప్పుకు శిక్షగా హత్య చేస్తుంది. దీంతో పదేళ్ల జైలు పాలవుతుంది. తిరిగి వచ్చాక వల్లి గతం గురించి తెలిసిన ఊరిపెద్ద వీరయ్య(రజనీకాంత్)ఆమెకు తగిన వరుడితో పెళ్లి చేయడంతో కథ ముగుస్తుంది.రజినీకాంత్ రచన చేసి ఇందులో కీలకమైన అతిథి పాత్ర చేయడంతో వల్లికి విడుదలకు ముందు మంచి క్రేజ్ వచ్చింది. అయితే దగాపడిన అమ్మాయి కథని కాస్త డ్రామా ఎక్కువ దక్కించి చూపడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. 
తెలుగులో ‘విజయ’ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడా అదే ఫలితం. ఇళయరాజా చక్కని సంగీతం ఇచ్చినప్పటికీ సినిమాను కాపాడేందుకు అదొక్కటే సరిపోలేదు. పైగా రజినీకాంత్ పాత్ర సీరియస్ గా సింధూర పువ్వులో విజయ్ కాంత్ తరహాలో ఉండటంతో జనానికి రుచించలేదు. అభిమానులకూ నచ్చలేదు. దీంతో పరాజయం తప్పలేదు. అయితే ప్రియరామన్ కు పేరు వచ్చింది. తెలుగు, మలయాళంలో చెప్పుకోదగ్గ అవకాశాలే దక్కించుకుంది. నెగటివ్ క్యారెక్టర్ చేసిన సంజయ్ కూడా కొంత కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తెరమీద హీరోయిజం భీభత్సంగా చూపించే రజనీకాంత్ పెన్ను పట్టుకుని ఆ మేజిక్ చేయలేకపోయాడు. కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ పాతగానే అనిపించడంతో విజయ సినిమా విజయం దక్కించుకోలేకపోయింది.