ఇటీవలే విడుదల చేసిన మేకింగ్ వీడియోతో ఆర్ఆర్ఆర్ ఆంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ట్రైలర్ రేంజ్ లో దీని గురించి రెస్పాన్స్ వచ్చిందంటే రాజమౌళి వేసిన మార్కెటింగ్ ప్లాన్ ఏ స్థాయిలో వర్కౌట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు చర్చలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇతర బాషల సెలబ్రిటీలు సైతం ఆర్ఆర్ఆర్ ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దానికి తోడు విడుదల తేదీని అక్టోబర్ 13కే కట్టుబడి మరోసారి కన్ఫర్మ్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టేసుకున్నారు. అలా అని సంబరపడటానికి లేదు.
ఇటీవలే ప్రధాన మంత్రి మోడీ మరో నాలుగు నెలలు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా ఇంకా వెళ్లలేదని ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూడో వేవ్ తప్పదని హెచ్చరించారు. కేరళ, మహారాష్ట్రలాంటి చోట్ల ఇప్పటికీ పది వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోనూ పరిస్థితి పూర్తిగా కుదుటపడలేదు. సో ఎలా చూసుకున్నా మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉన్న అక్టోబర్ కంతా మొత్తం నార్మల్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. పైగా హిందీ సినిమాలు బోలెడు రిలీజ్ దగ్గర ఆగిపోయినవి ఉన్నాయి. థియేటర్లు తెరిచాక వాటికి డేట్స్ ఇచ్చే విషయంలో అక్కడి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది
మరి అక్టోబర్ 13 అని ఆర్ఆర్ఆర్ నొక్కి చెప్పడానికి కారణం ఏంటనే సందేహం కలగొచ్చు. హిందీ హక్కులు కొన్న పెన్ స్టూడియోస్ తో పాటు ఇతర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ఆ డేట్ ని ఆధారంగా చేసుకునే బల్క్ అడ్వాన్సులు ఇచ్చారట. ఇప్పుడు ఒకవేళ పోస్ట్ పోన్ అంటే కొంత వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. అదేమీ పది ఇరవై కోట్లో కాదు. భారీ మొత్తం. అందుకే దానికే కట్టుబడి ఇలా చెప్పారని ఫిలిం నగర్ టాక్. ఇది నిజమైనా కాకపోయినా అక్టోబర్ 13కి ష్యుర్ గా ఆర్ఆర్ఆర్ వస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. అయినా కూడా జక్కన్న మార్కెటింగ్ ఎత్తుగడ మాత్రం సూపర్ అని చెప్పక తప్పదు