iDreamPost
iDreamPost
నిన్న శర్వానంద్ కొత్త సినిమా శ్రీకారం ట్రైలర్ రిలీజయింది. 14 రీల్స్ బ్యానర్ పై కిషోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ మూవీపై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. లాక్ డౌన్ టైంలో వచ్చిన వగలు పలుకుతావే పాట బ్లాక్ బస్టర్ కావడంతో అంచనాలు మెల్లగా ఎగబాకడం మొదలయ్యాయి. శర్వాకు ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. అందులోనూ మూడు డిజాస్టర్ల తర్వాత చేసిన మూవీ. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఇచ్చిన షాకులు మాములువి కావు. వాటి నిర్మాతలకు కనీసం బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇది కొంత మేరకు ఇప్పుడు శ్రీకారం మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. ఇక అసలు విషయానికి వద్దాం.
ట్రైలర్ కు రెస్పాన్స్ బాగున్నప్పటికీ శ్రీకారం మహేష్ బాబు మహర్షికి ఎక్స్ టెండ్ చేసిన వెర్షన్ లా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అందులోలాగే ఈ మూవీలో కూడా పెద్ద ఉద్యోగం, మంచి ఆదాయం వదులుకుని హీరో పల్లెటూరికి వచ్చి సేద్యం మొదలుపెడతాడు. ఆధునిక పద్దతులను తీసుకొచ్చి దిగుబడులు ఎలా పెంచుకోవాలో నేర్పిస్తాడు. రైతులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతాడు. ముఖ్యంగా యువత హలం పట్టుకుని పొలాల్లోకి రావాలంటూ పిలుపు ఇస్తాడు. మహర్షిలో దీన్ని వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ని జోడించి చూపించారు. ఇలా గట్టి పోలికలే దీని మీద వినిపిస్తున్నాయి.
రెండు కథలకు సంబంధం ఉన్నా లేకపోయినా అసలు పాయింట్ కలుస్తోంది కాబట్టి ఇప్పుడీ టాపిక్ ప్రస్తావనకు వచ్చింది. శ్రీకారం నిజంగా కంటెంట్ బాగుంటే మహర్షితో పోలిక ఉన్నా లేకపోయినా హిట్టు కొట్టేస్తుంది. అలా కాకుండా సారూప్యత ఎక్కువైతేనే ఇబ్బంది. అయినా దర్శక నిర్మాతలకు ఇదేం తెలియంది కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకునే కంపారిజన్ రాకుండా చూసుకుంటారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన శ్రీకారంకి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మార్చి 11న శివరాత్రి పండగ సందర్భంగా శ్రీకారం థియేటర్లలో అడుగు పెట్టనుంది.