Idream media
Idream media
నెల్లూరు నగరంలో మార్చి నెల వచ్చిందంటే శాస్త్రీయ సంగీత ప్రియులు త్యాగరాజ స్మరణోత్సవాల కోసం ఎదురు చూస్తారు. సంగీతం నేర్చుకుంటున్నవారి దగ్గర నుంచి శాస్త్రీయ సంగీతలో నిష్ణాతులైన వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి సంగీత ప్రియుల దాహం తీర్చే ఈ ఉత్సవాలను మొదలుపెట్టినది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు.
వాగ్గేయకారుడు త్యాగరాజు జన్మస్థలం తిరువాయూరులో ప్రతి ఏటా జరిగే ఆరాధనోత్సవాల నుంచి స్ఫూర్తి పొందిన సాంబమూర్తి గారు మిత్రుడు యనమండ్ర వెంకటేశ్వర శాస్త్రి, మరికొందరు సంగీతకారులతో కలిసి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందుకు అవసరమైన ధనాన్ని దాతల నుంచి విరాళాల రూపంలో కాకుండా, జోలె పట్టి, త్యాగరాజు కృతులు గానం చేస్తూ, నగర సంచారం చేస్తూ నగరవాసుల దగ్గర నుంచి భిక్ష రూపంలో సేకరించారు. జోలెలో బియ్యం, హుండీలో డబ్బులు సేకరించి 1965 లో మొదటి భిక్షాటనా పూర్వక త్యాగరాజ స్మరణోత్సవాలు నిర్వహించారు. భిక్షాటనలో వచ్చిన డబ్బుతో ఉత్సవాల నిర్వహణ, బియ్యంతో అన్నదానం చేశారు.
అప్పటినుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో భిక్షాటన మొదలుపెట్టి, ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి/మార్చి) బహుళ పంచమి నాడు పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఔత్సాహికులు, సంగీతం నేర్చుకుంటున్న వారికి త్యాగరాజ కృతులు పాడే అవకాశం దొరికితే, సాయంత్రం నుంచి రాత్రి వరకూ శాస్త్రీయ సంగీతంలో నిపుణులు పాడేవారు.
శాస్త్రీయ సంగీతలో ఉద్ధండులైన వారెందరో ఈ వేదిక మీద తమ ప్రతిభను ప్రదర్శించారు. చెంబై వైద్యనాధ భాగవతార్, డీకే పట్టమ్మాళ్, బొంబాయి సిస్టర్స్, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలమురళీ కృష్ణ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. తర్వాత కొన్నాళ్లకు భిక్షాటనా పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ పేరిట ఒక కమిటీ ఏర్పరచి దాని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాతలు ఇచ్చిన స్థలంలో త్యాగరాజ స్వామి ఆలయం కూడా నిర్మించారు. ఇప్పుడు నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన విరాళాలు సేకరించినా ఉత్సవాలు మొదలవడానికి రెండు మాసాల ముందు నుంచి భిక్షాటన కొనసాగిస్తూ అందులో సేకరించిన బియ్యంతో అన్నదానం చేస్తున్నారు.
కాలక్రమంలో సాంబమూర్తి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు మరణించినా వారి పుత్రులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కమిటీకి శాశ్వత అధ్యక్షుడుగా, యనమండ్ర నాగదేవి ప్రసాద్ శాశ్వత సెక్రటరీగా ఉంటూ ఏ లోటూ లేకుండా ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిగే రోజుల్లో బాలసుబ్రమణ్యం గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వచ్చి దగ్గరుండి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. దేశంలో ఉంటే బాలసుబ్రమణ్యం గారు కూడా ఏదో ఒక సమయంలో వచ్చి పర్యవేక్షిస్తారు. యాభయ్యవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని 2015లో గాన గంధర్వుడు జేసుదాస్ గారిచేత కచేరీ చేయించారు బాలు గారు. తన గురువైన చెంబై వైద్యనాధ భాగవతార్ కచేరీ చేసిన వేదిక మీద పాడటం తన అదృష్టం అని జేసుదాస్ గారు పైసా తీసుకోకుండా ఆ కచేరీ చేశారు.
మొదటి ఉత్సవాలకు భిక్షాటనలో భాగంగా మొదటి భిక్ష తన శ్రీమతి అయిన శకుంతల గారి నుంచి స్వీకరించారు సాంబమూర్తి గారు. ఆ ఉత్సవాలు విజయవంతం కావడంతో ఆ తరువాత ప్రతి సంవత్సరం మొదటి భిక్ష ఆమె దగ్గర స్వీకరిస్తూ వచ్చారు. సాంబమూర్తి గారు మరణించిన తర్వాత కూడా శ్రీమతి శకుంతల గారు మరణించే వరకూ కార్యక్రమ నిర్వాహకులు మొదటి భిక్ష ఆమె దగ్గర నుంచే స్వీకరిస్తూ వచ్చారు.
ఇప్పుడు బాలసుబ్రమణ్యం గారు మరణించినా పకడ్బందీగా ఉత్సవాలు నిర్వహించే కమిటీ ఉంది కాబట్టి ఉత్సవ నిర్వహణకు ఇబ్బంది లేకపోయినా అన్నీ తానై నడిపించే శక్తి లేకపోవడం మాత్రం పెద్ద లోటే!