iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజులు గడిచే కొద్దీ మారిపోతున్నాయి. కొత్త పొత్తులు పొడుస్తున్నాయి… తాజాగా సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పొత్తుల విషయంలో దూకుడుగా ముందుకు పోతున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్.. బీఎస్పీ యేతర పార్టీలతో ‘‘ఇంద్రధనస్సు’’ కూటమి కడుతున్నట్టు ప్రకటించారు. యూపీ ఎన్నికల్లోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో మమతా బెనర్జీతో పొత్తుకు సై అన్న అఖిలేష్ కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ససేమిరా అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు.ఎస్పీ 47 సీట్లు సాధించగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈసారి అధికార బీజేపీకి ఎస్పీ నుంచి గట్టిపోటీ నెలకొని ఉంది. సమాజ్‌వాది పార్టీ ఈ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధిస్తుందని సర్వే చెబుతోంది. 160 నుంచి 170 సీట్లు సాధిస్తుందని అంచనా. రోజులు గడుస్తున్న కొద్దీ ఎస్పీకి ఆదరణ పెరుగుతోందని తాజా అంచనా. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఎస్పీ ఇతర పార్టీలు బీఎస్పీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే సులువుగా అధికారం హస్తగతమవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కానీ విచిత్రంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీతో పోరాటానికి బీఎస్పీ, కాంగ్రెస్‌యేతర కూటమికి మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు పార్టీలు మినహా మిగిలిన అన్నిపార్టీలతోను ఇంద్రధనస్సు కూటమికి సై అంటున్నారు.
అఖిలేష్ మారుతున్న జాతీయ రాజకీయాలకు అనుగుణంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో పొత్తుకు ఓకే చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆ పార్టీతో పొత్తు ఉంటుందని అఖిలేష్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన పలు చిన్నాచితకా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. తొలిసారిగా రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)తో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పార్టీకి పశ్చిమ యూపీలో పట్టు ఉంది. అంతేకాకుండా సుహెల్‌దేవ్ భారతీయ జనతా పార్టీ, ఆప్నా దల్ (కె), మహాన్ దళ్, జనవాది పార్టీ (సోషలిస్టు), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)లతో పొత్తు పెట్టుకున్నారు.
బీఎస్పీతో కాకున్నా కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం, బీజేపీతో చేస్తున్న పోరాటం అక్కడ ప్రజల్లో కొంత ఆదరణకు కారణమైంది. ప్రియాంకా సైతం అఖిలేష్‌తో పొత్తుకు ఉత్సాహం చూపింది. అయితే అఖిలేష్ మాత్రం పొత్తు ససేమిరా అంటున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎస్పీకి 30.2 శాతం ఓట్లు వస్తాయని తొలి అంచనా. గత సెప్టెంబరులో సర్వేలో ఈ ఓటింగ్ శాతం తేలగా, నవంబరు నాటికి ఇది 28.1 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు శాతం పెరుగుతోంది. గత సెప్టెంబరు నాటి అంచనా ప్రకారం యూపీలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం 5.1 శాతం కాగా, నవంబరు నాటికి ఇది 8.9 శాతం కావడం విశేషం. అయినా ఎస్పీ అధినేత మాత్రం కాంగ్రెస్‌ను దూరం పెడుతున్నారు. పైగా ఎన్నికల ప్రచారసభలో ఆ పార్టీపై విరుచుకు పడుతున్నారు. ‘ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా సీట్లే’ అని ఎద్దేవా చేస్తున్నారు.