లాక్ డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన సినిమాల్లో బాలీవుడ్ సూర్యవంశీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ గత ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా మహమ్మారి పుణ్యమాని పదకొండు నెలలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఓటిటికి కనివిని ఎరుగని స్థాయిలో ఆఫర్లు వచ్చినప్పటికీ నిర్మాతలు వాటిని తిరస్కరిస్తూనే వచ్చారు. అక్షయ్ కుమార్ – అజయ్ దేవగన్ – రణ్వీర్ సింగ్ మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో బిజినెస్ పరంగా కూడా దీని మీద చాలా క్రేజ్ ఉంది. డిజిటిల్ సంస్థలు హక్కుల కోసం విపరీతంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.
సూర్యవంశీ దర్శకుడు కం నిర్మాతల్లో ఒకరైన రోహిత్ శెట్టి ఇప్పుడీ థియేట్రికల్ రిలీజ్ కోసం రెండు ప్రధానమైన డిమాండ్లు వినిపిస్తున్నాడు. అందులో మొదటిది మల్టీ ప్లెక్సులతో రెవిన్యూ షేరింగ్ లో మార్పులు. ఇప్పటిదాకా ఉన్న యాభై శాతం బదులు ప్రొడ్యూసర్ కు డెబ్భై శాతం రావాలని కోరుతున్నాడు. ఇప్పటికే పెట్టుబడి మీద విపరీతమైన వ్యయాన్ని భరించామని, అందుకే అర్థం చేసుకోమని అడుగుతున్నాడు. రెండోది రిలీజ్ అయ్యాక 28 రోజులకు ఓటిటి విడుదలను అనుమతించడం. దీనికి డిస్ట్రిబ్యూటర్ల నుంచి పెద్ద వ్యతికరేకత లేదు. మాస్టర్ 16 రోజులకు వచ్చినా కూడా వసూళ్లు భారీగా రావడాన్ని వాళ్ళు గుర్తించారు.
ఇప్పుడీ వివాదం సెటిల్ అయితే తప్ప సూర్యవంశీ రిలీజ్ కు రూట్ క్లియర్ కాదు. ఏప్రిల్ 2 ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఇప్పటికే ఓ ప్లాన్ వేసుకున్నారు. కానీ రోహిత్ శెట్టి కండీషన్ కు మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. తమవైపు నుంచి కూడా ఆలోచించాలని, సింగల్ స్క్రీన్ల కంటే తమ హాల్స్ లోనే ప్రేక్షకులు సినిమా చూడాలని ఎందుకు చూడాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. అత్యున్నత ప్రమాణాలు ఇవ్వాలంటే ఈ మాత్రం ఖర్చు ప్లస్ ఆదాయం అవసరమని అంటున్నారు. మొత్తానికి సూర్య వంశీకి చిక్కులు అంత ఈజీగా తొలగేలా కనిపించడం లేదు