iDreamPost
iDreamPost
విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. టీడీపీలో గజపతుల హవాతో పాటుగా నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్సీపీలో కూడా ప్రస్తుతం చక్రం తిప్పుతున్న బొత్సా సత్యన్నారాయణ ఆ జిల్లా వాసి కావడమే దీనికి కారణం. కీలక నేతలకు కేంద్ర స్థానంగా ఉండే విజయనగరంలో ఇప్పుడు వారసుల హవా కనిపిస్తోంది. ఇప్పటికే కురుపాం సంస్థానం వారసుల పాత్రలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణీ రాణిస్తున్నారు. తాజాగా పెన్మత్స సాంబశివరావు వారసుడు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. త్వరలో అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి ప్రత్యక్షంగా పోటీకి సన్నద్ధమవుతుండగా మరోవైపు సంచయిత చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న వీరభద్ర స్వామి కుమార్తె కూడా రాజకీయాల్లో ఛాన్స్ కోసం తహతహలాడుతున్నారు. ఇలా పలువురి వారసురాళ్లు బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమయంలో బొత్సా సత్తిబాబు కుటుంబం నుంచి వారసుడు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే బొత్సా మేనల్లుడు చిన్న శ్రీను సకల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ వ్యవహారాలతో పాటుగా పలు పదవుల్లో ఆయన రాణిస్తున్నారు. అయినప్పటికీ బొత్సా తనయుడు సందీప్ హఠాత్తుగా సీన్ లోకి రావడం సెన్సేషన్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తిబాబు తన కొడుకుని బరిలోకి తీసుకొచ్చే యోచనలో కనిపిస్తోంది. ఇప్పటికే సందీప్ బర్త్ డే పేరుతో జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలాకాలంగా బొత్సా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటూ, మెడిసిన్ చేసి వైద్య వృత్తిలో ఉన్న సందీప్ ని తెరమీదకు తీసుకురావడం ఆసక్తికరం అవుతోంది.
తాజాగా సందీప్ తన పుట్టిన రోజు నేరుగా జగన్ ని కలిసి ఆశీర్వాదం పొందడం, ఆ తర్వాత జగన్ బర్త్ డే కి రక్తదానం కూడా నిర్వహించి యంగ్ జనరేషన్ లీడర్ గా ఎదిగే ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో ఇప్పుడు బొత్సా రాజకీయ వారసత్వ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. సుదీర్గకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బొత్సా కొడుకు భవితవ్యం మీద పలు ఊహగానాలు కూడా మొదలయ్యాయి.