iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సడెన్ గా స్వరం పెంచారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. అంతటితో సరిపెట్టకుండా తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి 2024ని ముహూర్తంగా ప్రకటించారు. తనకు పదవుల మీద ధ్యాస లేదని, చంద్రబాబు పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. దాంతో తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశాలయ్యాయి.
ఏపీ బీజేపీ అద్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సోము వీర్రాజు తన మార్క్ చూపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితులు ఆయనకు అనుకూలించడం లేదు. ఇంటా బయటా ఆయన సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి భారీగా బీజేపీలోకి వలసలు వస్తాయని ఆపార్టీ నేతలు ఆశించారు. దానికి అనుగుణంగా కొంత ప్రయత్నం జరిగింది. సానుకూల సంకేతాలు కూడా వచ్చాయి. కానీ చివరకు చంద్రబాబు బ్రేకులు వేయడంతో ఏకంగా బీజేపీ జాతీయ కార్యాలయం వరకూ వెళ్లి రామ్ మాధవ్ తో బేటీ అయిన తర్వాత కూడా అనగాని సత్యప్రసాద్ వంటి వారు ఆగిపోయారు. గంటా శ్రీనివాసరావు వంటి వారు నేటికీ గోడ మీదనే ఉన్నారు. దాంతో బీజేపీ ఆశించిన ఫలితం దక్కలేదు.
అదే సమయంలో సోము వీర్రాజుకి చెక్ పెట్టేందుకు ఏపీ బీజేపీలోని ఓ వర్గం గట్టి యత్నాలు మొదటి నుంచి చేస్తోంది. ఆయన ప్రయత్నాలు ఫలించకుండా చూడాలని శతవిధాలా యత్నిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల బీజేపీ నేతలుగా ఉన్న వారంతా సోము వీర్రాజుకి సెగ పెట్టే పని సాగిస్తూనే ఉన్నారు. కొందరు బాహాటంగా సోముని వ్యతిరేకిస్తుంటే మరికొందరు అంతర్గతంగా అధిష్టానానికి ఫిర్యాదులతో నిత్యం చికాకు కలిగిస్తూనే వస్తున్నారు. వారి తాకిడి ఇటీవల బాగా తీవ్రమయ్యింది. చివరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అభిప్రాయాలనే బేఖాతరు చేసే వరకూ సాగింది. ఏబీఎన్ డిబేట్లకు ఎవరూ వెళ్లకూడదని సోము శాసిస్తే వాటిని లెక్కచేయకుండా లంకా దినకర్ వంటి వారు నేటికీ సస్ఫెన్షన్ తర్వాత కూడా పంథా మార్చుకోకపోవడం విశేషం.
Also Read : Uttarakhand Elections 2022 – తీర్పు సుస్థిరం… పాలకులు అస్థిరం…
కాపు నాయకత్వాన్ని సహించలేని వర్గం, సోము తీరుని జీర్ణించుకోలేని వర్గం ఇలా అందరూ కలిసి సొంతకుంపట్లోనే వీర్రాజుకి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలో పార్టీ బలపడితే తన మార్క్ చూపించవచ్చని ఆశిస్తే బీజేపీకి పదే పదే భంగపాటు తప్పడం లేదు. స్థానిక ఎన్నికలే కాకుండా, తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్ కి చేరువకాలేకపోయింది. వచ్చే ఎన్నికల నాటికి సోముని సాగనంపి తమకు అనుకూలమైన నేతను ఆ సీటులో కూర్చోపెడితే బీజేపీతో తమ పొత్తుకి మార్గం సుగమం అవుతుందని బాబు అండ్ కో భావిస్తోంది. దాంతో ఇటీవల సోము వీర్రాజుకి తీవ్ర సమస్యగా మారింది. వాటిని సహించలేని సోము వీర్రాజు తాజాగా బరస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
తనకు పదవులు ముఖ్యం కాదని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. 42 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, అనేక పదవులు అనుభవించానని గతంలో చంద్రబాబు తీరున ఫార్టీ ఇయర్స్ కామెంట్స్ చేసేశారు. అంతటితో సరిపెట్టకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని, ఓ జిల్లా ఎస్పీకి ఏకంగా నెలకు రూ. 5కోట్లు ముడుతున్నాయంటూ మండిపడ్డారు. నిజానికి సోము వీర్రాజు వ్యాఖ్యలే నిజమయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోర్టుల ద్వారానే ఎర్రచందనం రవాణా చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ అడ్డుకోకుండా ఏపీలో ప్రభుత్వం మీద నిందలు వేయడం విస్మయకరంగా కనిపిస్తోంది. అంతేగాకుండా పోలవరం కట్టలేకపోతే తమకు ఇచ్చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. పోలవరం విషయంలో బహుళార్థక సాధక ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, దానికయ్యే ఖర్చు ఎంత, కేంద్రం ఇప్పటి వరకూ ఇచ్చిన రూ. 11వేల కోట్లు ఏమూలకు అన్నది సోము కి తెలియని సంగతేమి కాదు. అయినప్పటికీ రాజకీయ ఉక్రోశంతో ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఆయన బలం పెంచడానికి దోహదపడతాయా అంటే సందేహమే.
బీజేపీలోని తన వ్యతిరేక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసమే జగన్ ప్రభుత్వం మీద విమర్శలకు పూనుకుంటే అది సోముకి ఏమాత్రం చేయూతనిస్తుందన్నది సందేహమే. అదే సమయంలో ఏపీలో బీజేపీ నేతల మధ్య అనైక్యత మూలంగా చివరకు పార్టీ అధ్యక్షుడే రెండేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాల్సి వచ్చిందనే సంకేతాలు బీజేపీని మరింత అపహాస్యం పాలుచేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఏమయినా సోము వీర్రాజు తాజా కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయనడంలో సందేహం లేదు.
Also Read : BJP, Somu Veerraju – తెగనమ్మడం కన్నా తాకట్టు నేరమా..?