త్వరలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణాలను ప్రోత్సహించేందుకు, ఆర్టీసీ బస్సుల్లో తలెత్తే “చిల్లర” సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ విన్నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా “ఆర్ఎఫ్ఐడీ”(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ డివైజ్) యంత్రానికి రూపకల్పన చేసి చిల్లర సమస్యకు చెక్ పెడుతూ నగదు రహిత ప్రయాణానికి రూపకల్పన చేయనుంది. తొలుత పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపోలో ఈ విధానం కార్యాచరణ చేసేందుకు రూపకల్పన చేశారు.
ఎటిఎం తరహాలో APSRTC కాష్ కార్డులను ప్రయాణికులకు ఇస్తారు. ఈ కార్డును 10 నుండి ఎంతవరకైనా రీఛార్జి చేసుకోవచ్చు. ఆర్ఎఫ్ఐడి యంత్రానికి వెనుకభాగంలో APSRTC కాష్ కార్డ్ ని ఉంచి, టికెట్ ధరను కండక్టర్ నమోదు చేస్తారు. టికెట్ ధర ఎంతో అందుకు సరిపడా నగదును డిజిటల్ క్యాష్ కార్డ్ నుండి యంత్రం తీసుకుంటుంది. కాబట్టి చిల్లర సమస్య తలెత్తే అవకాశం ఉండదు. కండక్టర్ వద్దనే డిజిటల్ కాష్ కార్డ్ రీఛార్జి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ డిజిటల్ క్యాష్ కార్డ్ ధరను ఎంత నిర్ణయించాలి అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. తొలుత ఆర్టీసీ ఈ విధానాన్ని జంగారెడ్డిగూడెం డిపోలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ విధానంలో కలిగే లోటుపాట్లు లోపాలను గుర్తించి యంత్రాల పనితీరును గమనించి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఆర్ఎం వీరయ్య చౌదరి వెల్లడించారు.