iDreamPost
android-app
ios-app

బెంగాల్లో సామాజిక సమీక’రణమే’ కీలకం

  • Published Apr 22, 2021 | 2:02 PM Updated Updated Apr 22, 2021 | 2:02 PM
బెంగాల్లో సామాజిక సమీక’రణమే’ కీలకం

ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్, బీజేపీల మధ్య సాగుతున్న రాజకీయ పోరు సామాజికవర్గ యుద్ధంగా మారింది. రాష్ట్రంలో గణనీయంగా ఉన్న దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు రెండు పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్ర ఓటర్లలో 20 శాతం వరకు ఉన్న దళితులు 100కు పైగా నియోజకవర్గాల్లో పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. ఈ నియోజకవర్గాల్లో అత్యధిక శాతం చివరి మూడు విడతల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే ఉండటంతో రెండు పార్టీలు వాటిపైనే దృష్టి సారించి పావులు కదుపుతున్నాయి.

మతువా, రాజ్ బోంగ్ సీలే కీలకం

బెంగాల్ దళితుల్లో మతువా, రాజ్ బోంగ్ సీ వర్గాల జనాభాయే ఎక్కువ. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు, వారి వారసులే మతువాలు. దక్షిణ బెంగాల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం అధికం. ఉత్తర బెంగాల్, కుచ్ బిహార్ ప్రాంతాల్లో రాజ్ బోంగ్ సీల ప్రభావం ఎక్కువ. మమతా బెనర్జీ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2011 ఎన్నికల నుంచి ఈ రెండు వర్గాలు తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మారాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితి కొంత మారింది. ఈ వర్గాల ఓట్లలో చీలిక తేవడం ద్వారా బీజేపీ ఊహించని విజయాలు సాధించింది. అప్పటి నుంచి మమతా పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. దళిత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు తృణమూల్ నానాపాట్లు పడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో 79 మంది దళిత అభ్యర్థులను బరిలోకి దించింది. ఎన్నికలకు ముందు నుంచే వారిని మచ్చిక చేసుకునేందుకు శరణార్థి కాలనీలు పునరుద్ధరించింది. భూమిపై హక్కు

కల్పించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు బీజేపీ కూడా దళిత ఓట్లు ఈసారి తమవేనన్న ధీమాతో పనిచేస్తోంది. కీలకమైన జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏ ఏ) పక్కాగా అమలు చేస్తామని ఎన్నికల నినాదంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది. తన సంప్రదాయ మత రాజకీయాలకు తోడు కుల రాజకీయాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మొన్నామధ్య బాంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పుడు.. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరీ మతువాల ఆధ్యాత్మిక గురువైన హరిచంద్ ఠాకూర్ జన్మస్థలమైన ఓరాకండిని సందర్శించారు.

మమత నేర్పిన విద్యే

వాస్తవానికి బెంగాల్లో మమతకు ముందు ఏ ఎన్నికల్లోనూ సామాజికవర్గాల పరంగా పోరాటం జరగలేదు. రాష్ట్రాన్ని 34 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్టులు సైద్ధాంతిక రాజకీయాలే సాగించారు తప్ప కులమతాలను విడదీసేందుకు ప్రయత్నించలేదు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ సామాజిక వర్గాలవారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మతువా అధికార పీఠమైన మతువా ఠాకూర్ బరి సభ్యులకు టికెట్లు ఇచ్చి బరిలోకి దించడం 2011 ఎన్నికల్లో ఆమెకు బాగా కలిసొచ్చింది. ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా లభించాయి. ఆ తర్వాత ఆమె కుల, జాతిపరంగా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. అయితే 2019లో బీజేపీ దళిత ఓటు బ్యాంకుపై వల వేసి తృణమూల్ కు ధీటుగా ఫలితాలు సాధించడంతో ప్రస్తుత ఎన్నికల్లో దళిత ఓట్లను కాపాడుకోవడం మమతకు సవాలుగా మారింది. దీనికి తోడు ఇంతకాలం టీఎంసీకి అండగా ఉన్న ముస్లిం ఓట్లలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని సంయుక్త మోర్చా, మజ్లీస్ పార్టీలు భారీ చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో.. దళిత ఓట్లపైనే మమత ఆశలు పెట్టుకున్నారు.