iDreamPost
android-app
ios-app

పాము – ముంగిస‌ ఒక రాజ‌కీయం

పాము – ముంగిస‌ ఒక రాజ‌కీయం

పాములాడించేవాన్ని చూస్తే చిన్న‌ప్పుడు భ‌యం, ఇప్పుడేమో గౌర‌వం. ఎందుకంటే వాన్ని చూస్తే అమెరికా గుర్తొస్తుంది. పాముల వాడు ఏదో చేసేస్తాను, చూపిస్తాన‌ని మ‌న‌ల్ని భ‌యంతో స‌స్పెన్ష్‌లో పెట్టి డ‌బ్బులు వ‌సూలు చేసుకుని వెళ్లిపోతాడు. అమెరికా వాడు కూడా ఇంతే.

ఎవ‌డి ఫోన్లు వాడికి వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌డి లోకం వాడిది. తీరిగ్గా నిల‌బ‌డి చుట్టూ ఉన్న ప్ర‌పంచాన్ని చూసే ఓపిక లేదు. ఒక‌ప్పుడు ప్ర‌పంచం విశ్రాంతిగా ఉండేది. ఒక మ‌నిషి ఇంకో మ‌నిషితో నేరుగా మాట్లాడేవాడు. అందుక‌ని జంక్ష‌న్‌లో నిల‌బ‌డి పాములాట చూసేవాళ్లు.

ఇప్పుడు సినిమాల‌కి ప్ర‌మోష‌న్ చేసిన‌ట్టు , పాములాట‌కు ముందు డోలు కొట్టి అంద‌ర్నీ ఆక‌ర్షించేవాళ్లు. జ‌నం గుమికూడిన త‌ర్వాత ఆట షురూ!

నిజానికి ఆట కంటే మాటే ఎక్కువ‌.

ఒక‌మ్మ‌కి న‌మ‌స్కారం, ఒక అయ్య‌కి దండం, ఆట చూడ్డానికి వ‌చ్చిన ఈ బాబుకి , ఆ టోపీవాలాకి , మీసాల పెద్దాయ‌న‌కి అంద‌రికీ దండం.

ఆటంటే మామూలు ఆట కాదు. మీరెన్నో ఆట‌లు చూసి ఉంటారు. కానీ ఇలాంటి ఆట ఎప్పుడూ చూసి ఉండ‌రు…

చంద్ర‌బాబు అమ‌రావ‌తి స్పీచ్‌లా ఆగేది కాదు.

ఈ బుట్ట‌లో పాముంది అంటాడు. అంత సుల‌భంగా బ‌య‌టికి తీయ‌డు. దీంట్లో ముంగిస ఉంది, ఇప్పుడు రెండింటికి జ‌గ‌డం, చూడ‌కుండా వెళ్ల‌కండి అంటాడు. వాడు చూపింది లేదు, ఇంత వ‌ర‌కూ చూసిన వాళ్లూ లేరు.

పాము ముంగిస జ‌గ‌డం చూడ‌లేద‌నే బాధ‌ని ఇప్పుడు బాబు -జ‌గ‌న్ తీరుస్తున్నారు, ఇదో అదృష్టం.

మ‌న‌ల్ని స‌స్పెన్ష్‌లో పెట్టి అస‌లు బిజినెస్‌లోకి దిగుతాడు. ప్ర‌పంచ దేశాల్ని యుద్ధం పేరుతో భ‌య‌పెట్టి , అమెరికా ఆయుధాల్ని అమ్మిన‌ట్టు , పాము విషానికి విరుగుడు అమ్మ‌డం స్టార్ట్ చేస్తాడు.

బిజినెస్‌కి ముందు పాముని బ‌య‌టికి తీస్తాడు. బూర ఊదుతాడు. “టియ్య‌వ్ టియ్య‌వ్” అని వీడు ఊదితే వాడి పెళ్లాం డోలు కొడుతుంది. వాడి కూతురు డ‌బ్బులు వ‌సూల్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది.

బూర ఆపి , చెయ్యిని పాము ద‌గ్గ‌ర పెడితే అది బుస్ మంటుంది.

“మాంచి రేసు మీదుంది, నిన్న‌నే త‌ల‌కోన అడ‌విలో ప‌ట్టినా, కాటు ప‌డితే ప‌ది నిమిషాలే ఆయువు…” అంద‌రి రియాక్ష‌న్ కోసం చూస్తాడు. భ‌యంభ‌యంగా చూస్తూ ఉంటారు.

పాముల వాడు మార్కెటింగ్ మొద‌లు పెడుతాడు.

“విషం ఇచ్చిన దేవుడు విరుగుడు కూడా ఇచ్చాడు. మా ముత్తాత న‌ల్ల‌మ‌ల అడ‌వులు తిరిగి న‌ల్ల‌తాచు పుట్ట‌లు వెతికి ఏడు త‌ల‌ల నాగుపాముని తెచ్చాడంటే ఈ వేరు కార‌ణం, పాము మిత్తి అంటారు దీన్ని”

సంచిలో నుంచి వేరు తీసి పాము ద‌గ్గ‌ర పెడితే అది వెన‌క్కి త‌గ్గుతుంది. “దీన్ని చూస్తే భ‌యం దానికి, ఒక అయ్య చేనికి పోతే పాము క‌ర‌వొచ్చు. ఒక అమ్మ నీళ్ల‌కు పోతే బావి ద‌గ్గ‌ర పాము ఉండొచ్చు. ఏం జ‌రిగినా ఈ వేరుతో రుద్దితే రెండే రెండు నిమిషాల్లో విషాన్ని పీలుస్తుంది. దీన్ని అమ్మ‌కూడ‌ద‌ని మా నాయ‌న ప్ర‌మాణం చేయించుకున్నాడు. అందుకే అమ్మ‌ను. అడ‌విలో తిరిగి దీన్ని తెచ్చినందుకు దారి బ‌త్యం ఇవ్వండి. ఒకొక్క‌టి రూపాయి” ( ఆ రోజుల్లో రూపాయికి విలువ ఉండేది).

పాము భ‌యం ఉన్న‌వాళ్లు, రూపాయి ఉన్న‌వాళ్లు కొనేవాళ్లు. వాడికి పాము క‌రిచేది లేదు, ఇది విషాన్ని పీల్చేది లేదు. పాముల వాడు త‌ట్టాబుట్టా , పాము ముంగిస‌ను ఎత్తి ఇంకో చోట డోలు కొట్టేవాడు.

ఇప్పుడు పాముల వాడు అంత‌రించిపోయాడ‌ని అంద‌రూ అనుకుంటారు కానీ, అది నిజం కాదు. వాళ్లంతా రాజ‌కీయాల్లో , సాప్ట్‌వేర్ మార్కెటింగ్‌లో చేరిపోయి జ‌నాల్ని అమ్ముతున్నారు.

జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి చూడండి. మీ ఎమ్మెల్యే ఒక‌ప్పుడు పాముల వాడు అయ్యి ఉంటాడు.

వాడు పాము ముంగిస ఆట‌ని చూపిస్తానంటాడు. ఈయ‌న అభివృద్ధిని చూపిస్తానంటాడు. రెంటినీ చూసిన వాళ్లు లేరు.

పాముల‌వాడి ద‌గ్గ‌ర విషానికి విరుగుడు కొంటాం.

ఇక్క‌డ నాయ‌కుడే పాము.

పామే విషానికి విరుగుడు అమ్ముతానంటుంది.

ఈ ఆట‌ని అర్థం చేసుకుంటే…
ప్ర‌జాస్వామ్యం అర్థ‌మ‌వుతుంది.