Idream media
Idream media
శిక్షణ కోసం వెళ్లిన మహిళా ఎస్సై విగతజీవిగా మారింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రం విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ) క్వార్టర్స్‌లో మహిళా ఎస్సై భవాని శనివారం అర్థరాత్రి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భవానీ.. క్రైం శిక్షణ నిమిత్తం విజయనగరం పీటీసీకి వెళ్లారు. ఐదు రోజుల శిక్షణ శనివారం పూర్తయింది. ఆదివారం తిరిగి ఆమె వెళ్లిపోవాల్సి ఉన్న తరుణంలో శనివారం అర్థరాత్రి పీటీసీ క్వార్టర్స్‌లో నిర్జీవస్థితిలో కనిపించింది.
భవాని స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం. ఆదివారం ఉదయం భవాని ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె కాల్ డేటాను పరిశీలించగా.. చివరిసారిగా విశాఖపట్నంలో ఉంటున్న తన సోదరుడితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శిక్షణ పూర్తయిందని తనతో చెప్పినట్లు భవానీ సోదరుడు పోలీసులుకు చెప్పారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే సోదరుడితో చేప్పే అవకాశం ఉందని, అయినా ఇలాంటిదేమీ జరగకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయనగరం డీఎస్పీ పి. అనిల్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.