iDreamPost
iDreamPost
కొన్ని అద్భుతాలు ఊహకు అతీతంగా జరుగుతాయి. సినిమా పరిశ్రమలో అయితే మరీ ఎక్కువ. ఎవరిని ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరి కష్టం ఎప్పుడు ఎలా ఫలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది అలాంటి కథే. 1992వ సంవత్సరం. తమిళ ప్రముఖ నిర్మాత కుంజుమోన్ గరంగరంగా ఉన్నారు. దర్శకుడు పవిత్రన్ తో ఆయన తీసిన సూరియన్(తెలుగులో మండే సూర్యుడు)బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. హీరో శరత్ కుమార్ ఒక్క రాత్రిలో స్టార్ అయ్యాడు. వాళ్ళ కాంబినేషన్ లోనే మరో మూవీ తీయాలని ఆయన ఆలోచన. ముందు ఓకే అన్న ఆ ఇద్దరు తర్వాత హ్యాండ్ ఇచ్చి వేరే ప్రొడ్యూసర్ కు కమిట్ అయ్యారు. దీంతో కుంజుమోన్ లో కసి పెరిగింది. సరిగ్గా అప్పుడు వచ్చాడు శంకర్.
ఓ అప్పడాలు అమ్మకునే బ్రాహ్మల కుర్రాడు రాబిన్ హుద్ తరహాలో దొంగతనాలు చేస్తూ పేదల కోసం ఆసుపత్రి కడుతూ ఉంటాడు. కానీ పోలీసులకు తన జాడ దొరక్కుండా జాగ్రత్త పడతాడు. ఇదీ స్టోరీ లైన్. తాను చేసే మార్పులకు ఒప్పుకోవాలనే కండీషన్ మీద కుంజుమోన్ భారీ బడ్జెట్ తో జెంటిల్ మెన్ మొదలుపెట్టారు. హీరోగా ముందు రాజశేఖర్ ను అనుకున్నారు. కుదరలేదు. తర్వాత అర్జున్ దగ్గరకు వెళ్ళాడు శంకర్. మొత్తం విని షాక్ అయిన యాక్షన్ కింగ్ మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. షూటింగ్ ముప్పాతిక భాగం అయ్యాక క్లైమాక్స్ మార్చమన్నారు కుంజుమోన్. విలన్ మంత్రిగా చేసిన రాజన్ పి దేవ్ ని అర్జున్ చంపేలా కాకుండా వేరే స్టూడెంట్ వచ్చి సైకిల్ బాంబుతో వచ్చి హత్య చేసేలా చేంజ్ చేయమన్నారు. ఖంగు తినడం శంకర్ వంతైంది. అర్జున్ తన హీరోయిజం డైవర్ట్ అవుతుందని నో అన్నాడు. అయితే అప్పటిదాకా తీసిన నెగటివ్ కాల్చేసి ఇంకో హీరోతో మొత్తం రీ షూట్ చేస్తానని సవాల్ చేశాడు కుంజుమోన్.
దీంతో విధి లేక అర్జున్ ఒప్పుకున్నాడు. షూటింగ్ కు ముందే ఒప్పుకున్న కండీషన్ వల్ల శంకర్ నోరు విప్పడానికి లేదు. అలా చివరి ఎపిసోడ్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. అంతా పూర్తయ్యాక జెంటిల్ మెన్ మీద బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు . దాంతో కుంజుమోన్ స్వంతంగా విడుదల చేసుకున్నారు. చెప్పుకోదగ్గ అంచనాలు లేకుండా జులై 30, 1993న జెంటిల్ మెన్ రిలీజయింది. నిండా మునుతుందనుకుంటే రజని, కమల్ లాంటిస్ స్టార్ల సినిమాలను దాటేసి ఈ సినిమా ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ట్రైలర్ తో జనాలు వెర్రెక్కిపోవడం దీంతోనే మొదలు. అలా జెంటిల్ మెన్ రూపంలో డెబ్యూతోనే చరిత్ర సృష్టించిన శంకర్ ఆ తర్వాత ఎన్ని అద్భుతాలు ఆవిష్కరించారో తెలిసిందే. ఇవాళ శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ జ్ఞాపకాలు పంచుకోవడం సముచితం.