Idream media
Idream media
మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న బెంగాల్ లో పవర్ కోసం భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల మీద ఎత్తుగడలు వేస్తోంది. బీజేపీ పెద్దలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రంలో పర్యటిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మమత శిబిరంలో ఒణుకు పుట్టిస్తున్నారు. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీని వీడి బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీఎంసీని చావుదెబ్బ తీసి కాషాయజెండా ఎగరేస్తామని షా ప్రకటించడం అధికార పార్టీ నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ప్రతివ్యూహాలు రచిస్తోంది. టీఎంసీ కాపాడుకుంటూ బీజేపీని ఎదుర్కోవడానికి మరింత బలం కూడగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో చర్చలు జరపడం, టీఎంసీ తో ప్రచారానికి సైతం ఆయన ఓకే అనడంతో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీయేతర పక్షాలను రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సైతం తన వ్యూహాలకు పదును పెడుతోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం దేశ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఎప్పటి నుంచో బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీ.. క్రమంగా బలపడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసురుతోంది. బెంగాల్‌లో జరుతున్న పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ రంగంలోకి దిగడం టీఎంసీ శ్రేణులకు కాస్త మనోబలాన్ని ఇస్తోంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సైతం పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు టీఎంసీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు బెంగాల్‌లో భారీ ర్యాలీని మమత ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన అధినేత సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో జేడీ నడ్డాపై దాడికి ప్రతిచర్యగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయం అనంతరం.. అనేక మంది జాతీయ నేతలు మమతకు అండగా నిలిచి.. బీజేపీ తీరును తప్పుపట్టారు. కాగా మమత, పవార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసింది. గతంలో అనేకమార్లు బెంగాల్ ప్రభుత్వానికి పవార్ అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన పవర్ పని చేస్తుందని టీఎంసీ భావిస్తోంది.