iDreamPost
iDreamPost
కోట్లాది రూపాయలతో సినిమా తీస్తున్నాం అనగానే ప్రేక్షకుడు ఎగ్జైట్ అయిపోయి బ్రహ్మాండంగా ఉందని కితాబు ఇచ్చేయడు. దానికి చాలా లెక్కలు ఉంటాయి. వాళ్ళను మెప్పించే కంటెంట్ ఉండాలి. లేకపోతే ఎంత హంగు ఆర్భాటాలు చేసినా ఉపయోగం ఉండదు. కేవలం డబ్బుని బూడిదలో పోయడం తప్ప. ఆ మధ్య సాహో చూశాంగా. అలాంటిదే ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కూడా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అదేంటో చూద్దాం. 1990లో కన్నడ స్టార్ హీరో వి రవిచంద్రన్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో శాంతి క్రాంతి అనే భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. అప్పటిదాకా శాండల్ వుడ్ లో ఎవరూ పెట్టని బడ్జెట్ తో దీన్ని రూపొందించారు.
టాలీవుడ్ వెర్షన్ కు నాగార్జున హీరోగా చేశారు. జుహీ చావ్లా హీరోయిన్. డిఫరెంట్ లుక్ కోసం హాస్య మరియు విభిన్న చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న అనంత్ నాగ్ ని విలన్ గా చూపించారు. హంసలేఖ దీని కోసం 9 పాటలు కంపోజ్ చేశారు. నిర్మాణం చాలా కాలం కొనసాగింది. డాడీ అనే మాఫియా డాన్ పైకి చిన్నపిల్లలను చేరదీసే ఆశ్రమం నడుపుతూ లోపల అవయవాల వ్యాపారంలో చాలా దుర్మార్గాలు చేస్తాడు. దీన్ని పసిగడతాడు పోలీస్ ఆఫీసర్ సుభాష్(నాగార్జున). కానీ ఈ క్రమంలో తన ప్రియురాలిని పోగొట్టుకుంటాడు. చివరికి ఆ కోటలో ఉండే పిల్లలతోనే సుభాష్ ఆ డాడీ భరతం ఎలా పట్టారు అనేదే కథ.
శాంతిక్రాంతి బిజినెస్ స్టేజిలోనే చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇంత భారీ బడ్జెట్ లో రూపొందటం చూసి అభిమానులు అంచనాలు విపరీతంగా పెంచేసుకున్నారు. 1991 సెప్టెంబర్ 19న శాంతి క్రాంతి మూడు భాషల్లో ఒకేసారి విడుదలయ్యింది. మొదటిషోకే డిజాస్టర్ టాక్. ఏదేదో ఊహించుకుని వెళ్లిన ప్రేక్షకులకు నీరసం తెప్పించే కథనం, చీటికీ మాటికీ పంటికింద రాళ్లలా అడ్డు తగులుతున్న పాటలు, సింగల్ లైన్ మీద సాగదీసిన స్క్రీన్ ప్లే మొత్తంగా ఫ్లాప్ ముద్ర వేయించేసుకుంది. రెండు మూడు పాటలు బాగున్నప్పటికీ ఏకంగా తొమ్మిదిని ఇరికించడం దెబ్బ కొట్టింది. సెకండ్ హాఫ్ లో అవసరానికి మించి పిల్లలతో చేయించిన యాక్షన్ డ్రామా తేడా కొట్టింది. ఫలితంగా శాంతి క్రాంతి బడ్జెట్ కోట్లలో ఉన్నా కంటెంట్ మాత్రం పైసల్లో ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. దీని దెబ్బకు రవిచంద్రన్ ఆర్థిక మూలాలు బాగా దెబ్బతిని కోలుకోవడానికి చాలా టైం పట్టింది.