iDreamPost
android-app
ios-app

యోగి సర్కారుకు మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై -ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి దెబ్బ

  • Published Jan 11, 2022 | 2:49 PM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
యోగి సర్కారుకు మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై  -ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి దెబ్బ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని నెలల నుంచి దూసుకుపోతున్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. సీఎం ఆదిత్యనాథ్ యోగి కేబినెట్‌లో కార్మికమంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య తన మద్దతుదారులతో కలిసి పార్టీకి షాక్ ఇచ్చారు. మంత్రి పదవికి, బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారందరినీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

సీఎం యోగిపై అసంతృప్తితోనే

తన రాజీనామా పత్రంలో యోగి ప్రభుత్వంపై మౌర్య పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఓబీసీలు, దళితులు, యువత, రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆ వర్గాలకు న్యాయం జరగనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ సాఖ్య సైతం రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రముఖ ఓబీసీ నేతల్లో ఒకరైన స్వామి ప్రసాద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పద్రౌనా నుంచి ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఆయన కుమార్తె సంఘమిత్ర బదౌన్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. గతంలో బీఎస్పీలో ఉన్న మౌర్య 2016లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2017 ఎన్నికల్లో ఓబీసీలను బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.

సమాజ్‌వాదీ పార్టీలోకి..

సీఎం యోగి ఏకపక్ష వైఖరిపై కొన్నాళ్ల నుంచి బీజేపీలోని ఒక వర్గంలో అసంతృప్తి ఉంది. రెండు నెలల క్రితం యోగిపై అమిత్ షాకు మౌర్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫలితం లేకపోవడంతో రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. మంత్రి రాజీనామా చేసిన వెంటనే మంత్రి, ఆయన మద్దతుదారులను ఎస్పీలోకి ఆహ్వానిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. వారంతా ఎస్పీలో చేరే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో నలుగురు ఎమ్మెల్యేలు..రాధాకాంత్ శర్మ, మాధురి వర్మ, రాకేష్ రాథోడ్, శశాంక్ త్రిపాఠీలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తాజాగా మంత్రి, మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటంతో ఎన్నికల్లో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన పార్టీలో నెలకొంది. అసలే ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీయే వస్తుందని సర్వేలు ఘోషిస్తున్న తరుణంలో తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి.