iDreamPost
android-app
ios-app

ఏపీలో ప్రభుత్వ వైద్యంలో సంచలన మార్పులకు శ్రీకారం

  • Published Sep 13, 2020 | 1:30 AM Updated Updated Sep 13, 2020 | 1:30 AM
ఏపీలో ప్రభుత్వ వైద్యంలో సంచలన మార్పులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రభుత్వ విద్య పునురేత్తేజం పొందుతోంది. గడిచిన మూడు దశాబ్దాలుగా నిర్లక్ష్యం నీడలో ఉన్న ప్రభుత్వ బడులు ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. మళ్లీ పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే బడి వాతావారణం కనిపిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటుగా పిల్లలను బడులకు పంపించే తల్లులకు అమ్మ ఒడి పథకం వంటివి ఇప్పటికే అమలులోకి వస్తున్నాయి. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్ద పథకం పలు మార్పులు తెచ్చింది. ఇంగ్లీష్ మీడియం ద్వారా కార్పోరేట్ స్కూళ్లను తలపించేలా ప్రభుత్వ పాఠశాలలు మారబోతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే రాబోయే మూడేళ్లలో రూ. 15వేల కోట్ల నిధులతో ప్రభుత్వ బడులన్నీ రూపు రేఖలు మార్చుకుని పిల్లలను రారమ్మనే స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే సమయంలో ప్రభుత్వ వైద్య రంగానికి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. దానికి అనుగుణంగానే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ జిల్లా పరిధిలో వైద్య కళాశాల ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడున్న 13 జిల్లాల్లోనే ప్రభుత్ వైద్య కళాశాలలు లేవు. కానీ రాబోయే 25 జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనే జగన్ సంకల్పం సంచలనంగా మారంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు మాత్రమే కాకుండా ఆచరణ కూడా మొదలయ్యింది. తాజాగా ఒకేసారి 10 కళాశాలలకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ కనివినీ ఎరుగని కీలక నిర్ణయం ఇది. ఒకేసారి 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్యం సమూలంగా మారిపోయే అవకాశం ఉంది.

మచిలీపట్నంలో వైద్య కళాశాలకు రూ. 550 కోట్లు, పులివెందుల, పిడుగురాళ్ల, పాడేరు కాలేజీలకు రూ. 500 కోట్ల చొప్పున కేటాయించిన ప్రభుత్వం మరో ఆరు కళాశాలలకు భూమి కొనుగోలు కోసం రూ. 104 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఆయా బోధనాసుపత్రుల నిర్మాణాలకు డిజైన్లు పూర్తయ్యాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. సంబంధిత పనులకు కన్సల్టెంట్లను కూడా నియమించారు. రాబోయే మూడేళ్లలో మొత్తం 16 వైద్య కళాశాలల నిర్మించే దిశలో ప్రణాళికలు వేసుకుని పనులు ప్రారంభించడం విశేషంగా చెప్పవచ్చు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక్కో జిల్లా ఏర్పాటు కాబోతున్న తరుణంలో ప్రతీ 20లక్షల మంది జనాభాకి ఒక వైద్య కళాశాల అందుబాటులోకి రాబోతోంది. ఇది వైద్య రంగంలోనే అనేక మార్పులకు దోహదం చేయబోతోంది.

ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో పడకలు లభిస్తాయి. ఇప్పటికే ఆరోగ్య శ్రీ విస్తరించి వెయ్యి రూపాయలు దాటిన వైద్య సహాయం పూర్తిగా ప్రభుత్వమే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వైద్య కళాశాలల నిర్మాణం ద్వారా పేదలకు వైద్యం భరోసాగా మారబోతోంది. కార్పోరేట్ వలలో చిక్కుకుని విలవిలలాడిన మధ్య తరగతికి కూడా ఊరటగా మారబోతోంది. జగన్ ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన ఈ పనులు పూర్తయితే ఏపీ విద్య, వైద్య రంగాలలో అనూహ్య ప్రగతి సాధిస్తుందనడంలో సందేహం లేదు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్య రంగం ప్రాధాన్యత ప్రపంచానికి పాఠంగా మారుతుండగా, దానికి ముందు నుంచే జగన్ తన సంకల్ప బలంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసే ప్రయత్నాలకు పూనుకోవడమే ఆసక్తికరం.