iDreamPost
android-app
ios-app

2009 సెప్టెంబ‌ర్ 2 ఏం జ‌రిగింది?

2009 సెప్టెంబ‌ర్ 2 ఏం జ‌రిగింది?

నా జ‌ర్న‌లిస్టు కెరీర్‌లోనే సెప్టెంబ‌ర్ 2, 2009 బాధాక‌ర‌మైన రోజు. సాక్షి తిరుప‌తి ఎడిష‌న్ ఇన్‌చార్జ్‌గా ప‌ని చేస్తున్నాను. ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చిత్తూరు జిల్లా ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నారు. నేను, బ్యూరో ఇన్‌చార్జ్ న‌గేష్ క‌లిసి క‌వ‌రేజ్ ప్లాన్ చేశాం. హెలీపాడ్ ద‌గ్గ‌ర స్వాగ‌తం నుంచి సాయంత్రం వీడ్కోలు వ‌ర‌కు ప్రోగ్రాం క‌వ‌ర్ చేయాల్సిన రిపోర్ట‌ర్ల‌కి ప్లానింగ్ ఇచ్చేశాం. చిత్తూరు స్టాప‌ర్ అర‌వింద్ త‌న టీం మొత్తాన్ని రంగంలోకి దింపాడు.

ర‌చ్చ‌బండ చాలా ప్రిస్టేజియ‌స్ ప్రోగ్రాం కాబ‌ట్టి తిరుప‌తి నుంచి ఫొటోగ్రాఫ‌ర్స్ టీంతో బ్యూరో ఇన్‌చార్జ్ వెళ్లారు. ఉద‌యం 8 గంట‌ల‌క‌ల్లా రిపోర్టింగ్ టీం ఎక్క‌డిక‌క్క‌డ చేరుకున్నారు.

ఉద‌యం 10 గంట‌ల‌కి ఫీడ్‌బ్యాక్ కోసం చూస్తున్నా. ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. 10.30 గంట‌ల‌కి సీఎం ప్రోగ్రాం కాన్సిల్ అయింద‌ని న‌గేష్ చెప్పాడు. కార‌ణం ఎవ‌రికీ తెలియ‌దు. హెలీకాప్ట‌ర్‌లో ఏదో ప్రాబ్లం. తిరిగి హైద‌రాబాద్‌ వెళ్లిపోయింది. 11.30 గంట‌ల‌కి సీఎం హైద‌రాబాద్ వెళ్ల‌లేదు. మ‌ధ్య‌లోనే హెలీకాప్ట‌ర్‌ని దించేశార‌ని వార్త‌. అంద‌రిలోనూ టెన్ష‌న్‌. ఎవ‌రి ద‌గ్గ‌ర స‌మాచారం లేదు. పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా ఏమీ చెప్ప‌లేని స్థితి. టీవీల్లో స్క్రోలింగ్‌. జ‌నంలో ఏదో దుక్కం. తిరుప‌తిలో అభిమానులు పూజ‌లు చేస్తున్నారు.

చెన్నై నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్ట‌ర్లు బ‌య‌ల్దేరి రేణిగుంటలో ఇంధ‌నం కోసం ఆగాయి. వైఎస్ హెలీకాప్ట‌ర్ క్రాష్ అయి ఉంటుంద‌ని ఆ పైలెట్లు అనుమానం వ్య‌క్తం చేశారు. భ‌యం ఎక్కువైంది. నిజం కాకూడ‌దు. ఎక్క‌డో ఒక చోట దిగి క్షేమంగా వ‌చ్చి న‌మ‌స్తే చెల్లెమ్మా అంటాడ‌ని ఆశ‌.

సాయంత్రం రోశ‌య్య ప్రెస్‌మీట్ త‌ర్వాత ఆశ స‌న్న‌గిల్లింది. కానీ రాత్రంతా మంచి వార్త వింటామ‌ని ఎదురు చూపులు. ర‌చ్చ‌బం డ‌లో ప్ర‌జ‌ల‌తో ఉన్న ఫొటోల్ని వేయాల్సిన పేప‌ర్‌లో ఆయ‌న కోసం జ‌నం దుక్కించే ఫొటోలు వేశాం. తెల్లారింది. అంతా అయిపోయింది. కెరీర్‌లో ఎన్నో ఎన్నిక‌ల్ని, ట‌ప్ సిట్యుయేష‌న్స్ హ్యాండిల్ చేసిన నేను , వైఎస్ మ‌ర‌ణ‌వార్త‌ని, న్యూస్ క‌వ‌రేజీ చేయాల్సి వ‌స్తుంద‌ని అనుకోలేదు. అచేత‌నంగా , మౌనంగా ఉండిపోయాను.

కాంగ్రెస్ రాజ‌కీయాల్ని పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని నేను వైఎస్ అభిమానిని. ఆయ‌న మా ఊరి అల్లుడు (చిన్న‌త‌నంలో విజ‌య‌మ్మ తాడిప‌త్రి స‌మీపంలోని చీమ‌ల‌వాగుప‌ల్లిలో పెరిగారు). అదొక‌టే కార‌ణం కాదు. 1992 నుంచి 96 వ‌ర‌కు నేను ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప ఇన్‌చార్జ్‌గా ప‌నిచేశాను. ఒక నాయ‌కుడిగా, ఒక వ్య‌క్తిగా ఆయ‌న జ‌నానికి ఎంత స‌న్నిహితుడో క‌ళ్లారా చూశాను.

ఆయ‌న గురించి చాలా విష‌యాలు విన్నా, రెండు మాత్రం ఇక్క‌డ చెబుతా.

వైఎస్ క‌డ‌ప‌కు వ‌స్తే ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో దిగేవారు. ఆయ‌న వ‌స్తే జ‌నం సంద‌డి. ఒక‌రోజు ఆయ‌న‌తో అనుచ‌రులు ఒక విష‌యం చెప్పారు. గెస్ట్‌హౌస్ అటెండ‌ర్ ఎవ‌రో అతిథి వాచీ దొంగిలించాడ‌ని. ఆ అటెండ‌ర్‌ని పిల‌వ‌మ‌ని వైఎస్ చెప్పారు. తిడ‌తార‌నే భ‌యంతో అటెండ‌ర్ వ‌ణుకుతూ వ‌చ్చాడు.

నీకెంత జీతం? (1992లో)
రూ.250 సార్‌
పిల్ల‌లెంద‌రు?
ముగ్గురు సార్‌
మేనేజ‌ర్‌ని పిల‌వ‌మ‌న్నాడు వైఎస్‌
“ఈ నెల నుంచి వాడి జీతం పెంచు. రూ.250 ఇస్తే దొంగ‌త‌నం చేయ‌క ఇంకేం చేస్తాడు” అని మేనేజ‌ర్‌ని మంద‌లించాడు.
అటెండ‌ర్‌కి కొంత డ‌బ్బు ఇచ్చి “దొంగ‌త‌నం త‌ప్ప‌, ఏదైనా క‌ష్ట‌మొస్తే ఈ సారి నాతో చెప్పు” అన్నాడు.

అనంత‌పురం జిల్లా పార్న‌ప‌ల్లె ద‌గ్గ‌ర ఒకాయ‌న వైఎస్ అనుచ‌రుడు ఆ ఏరియాకి వైఎస్ వ‌స్తే భారీగా స్వాగ‌తం ప‌లికేవాడు. వైఎస్ సీఎం అయిన త‌ర్వాత ఆయ‌న గురించి వాక‌బు చేస్తే ఆర్థికంగా చితికిపోయాడ‌ని తెలిసింది. వెంట‌నే ఆయ‌న్ని హైద‌రాబాద్‌కి పిలిపించారు.

ఆయ‌న వ‌చ్చి “న‌మ‌స్కారం సార్” అన్నాడు విన‌యంగా.
“న‌న్ను నువ్వు అన్నా క‌దా అనేది, కొత్త‌గా సారేంది?”
“మీరు ముఖ్య‌మంత్రి క‌దా అన్నా”
“మీరంతా నా వెనుకుంటేనే క‌దా నేను సీఎంని అయ్యింది”
ఇంటికి తీసుకెళ్లి భోజ‌నం పెట్టించాడు. ఆ వ్య‌క్తి మొహ‌మాట ప‌డితే “నీ ఇంట్లో చాలా సార్లు తిన్నాను క‌ద‌య్యా, నా ఇంట్లో కూడా తిను” అన్నాడు.

స‌మాజంలో వైద్యులు చాలా మంది ఉన్నారు. స‌మాజానికి వైద్యం చేసే వైఎస్ లాంటి వాళ్లు అరుదుగా ఉంటారు.
చాలా త‌రాలు గుర్తుండే వ్య‌క్తి వైఎస్‌.