ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ నియమితులు అయ్యారు. కేబినెట్ హోదాను ఆయనకు ప్రభుత్వం కల్పించింది. రజనీష్ కుమార్ బ్యాంకింగ్ రంగంలో ప్రవీణుడు. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆయన 2020 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. ఆ బ్యాంకులోనే అప్పటికి నలభై సంవత్సరాలు పనిచేశారు. ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఎస్ బీఐలో 1980లో ప్రవేశించిన ఆయన ఉన్నత పదవులు పొందారు అద్భుతమైన ఆర్ధిక వేత్తగా పేరు సంపాదించారు. అతి పెద్ద బ్యాంకులో ఏడు బ్యాంకులను విలీనం చేయడంలో ఆయన కీలకమైన భూమిక పోషించారు. ఎస్ బీఐ యోనో ప్లాట్ ఫాం ను ఆవిష్కరించి డిజిటల్ రంగంలో దూసుకొని పోవడానికి కూడా రజనీష్ కుమార్ సారథ్యమే కారణం. ‘ఎస్ బ్యాంక్’ను కాపాడటం ఆయన హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు.
హాంకాంగ్ అండ్ షంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ కు చెందిన ఆసియా విభాగానికి నాన్ –ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ గా రజనీష్ నియుక్తులైనారు. ఈ విషయం 30 ఆగస్టు 2021న బహుళజాతీయ బ్యాంక్ ప్రకటించింది. ఆ బ్యాంకు ఆసియా విభాగంలో ఆడిట్ కమిటీలో, రిస్క్ కమిటీలో సభ్యుడిగా కూడా రజనీష్ కుమార్ పని చేశారు.
బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ పార్ట్నర్స్ ఇండియాకు సలహాదారుగా 2021 ఫిబ్రవరిలో చేరారు. కోటక్ ఇన్వెస్ట్ మెంటె అడ్వయిజర్ గా వందకోట్ల ప్రత్యేక పరిస్థితి నిధికి బాధ్యులుగా రజనీష్ కుమార్ ఉంటారని కోటక్ మహేంద్ర బ్యాంకు ప్రకటించింది. ఎస్ బీఐ చైర్మన్ గా పదవీ విరమణ చేసినవారు ప్రైవేటు కంపెనీలలో చేరడం ఇదే మొదటి సారి కాదు. అమెరికా క్లౌండ్ బేస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ‘సేల్స్ ఫోర్స్ .కామ్’కు సీఈవో గా రజనీష్ కంటే ముందు ఎస్ బీఐ చైర్పర్సన్ గా పదవీ విరమణ చేసిన అరుంధతి భట్టాచార్య చేరారు. ఇతర మాజీ చైర్మన్లు కూడా సలహాదారులుగా, ప్రవేటు కంపెనీలలో డైరెక్టర్లుగా చేరారు.
ఇన్ని పదవులలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఎట్లా న్యాయం చేయగలరని ఆలోచన వస్తే.. వీటిలో ఇబ్బంది ఏమీ లేదనీ, ఏ బాధ్యతకు ఆ బాధ్యత ఉంటుందనీ, పరస్పర ఘర్షణ ఏమీ లేదనీ, అన్ని పదవులలో కొనసాగుతాననీ, అన్నిటికీ న్యాయం చేస్తాననీ రజనీష్ కుమార్ చెబుతున్నారు. ప్రస్తుత కీలక సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రజనీష్ సలహాలు చాలా కీలకం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నదనీ, అందులో తన సహకారం కోసం తనను సలహాదారుగా నియమించిందనీ ‘మనీ కంట్రోల్ ’కు వివరించారు. కచ్చితంగా పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చూపుతానని చెబుతున్నారు. గతంలో కీలకమైన బ్యాంకింగ్ రంగంలో పని చేసిన రజనీష్ కుమార్ ఆర్థిక సలహాదారుగా చేసుకోవడం మంచి ఎంపిక అనేది నిపుణుల మాట.
Also Read : పవన్ పై గెలిచిన ఆ ఇద్దరిలో ఒకరికి జగన్ కేబినెట్లో చోటు?