iDreamPost
android-app
ios-app

“ఇందిరా పార్కులో” దొంగలు పడ్డారు…

“ఇందిరా పార్కులో” దొంగలు పడ్డారు…

అవును మీరు చదువుతుంది నిజమే.హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కులో అత్యంత విలువైన గంధపు చెట్లను నరికి దుంగలు ఎత్తుకెళ్లారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరాపార్కు బయోడైవర్సిటీ వింగ్‌ అటవీ రేంజ్‌ అధికారి సత్యనారాయణ సోమవారం రాత్రి  గాంధీనగర్‌ పోలీసులకు గంధపు చెట్లు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకునేందుకు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటిదొంగల హస్తం ఉందా?

ఆదివారంనాడే 13 గంధపు చెట్లను దొంగలు ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లినట్లు పార్కు సిబ్బంది గుర్తించినా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది గోప్యంగా ఉంచారు. గంధపు చెట్ల దొంగతనంలో పార్కు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

అందులో భాగంగా పార్క్‌లో ఉన్న తోటమాలీలు, సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి నలుగురు సెక్యూరిటీ గార్డులు ఇందిరా పార్కులో విధుల్లో ఉన్నారు. లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణమఠం గేటు ఎదురుగా ఉన్న ప్రధాన గేటు,  ధర్నా చౌక్‌లో ఉన్న పార్కు గేటు మూసే ఉన్నాయి. కటింగ్ మిషన్లతో పార్కులోకి ప్రవేశించిన దుండగులు 13 గంధపు చెట్లను అక్కడే మిషన్ల సాయంతో నరికి ముక్కలు చేసి దుంగలను ఎత్తుకెళ్లారు. పార్కు గురించి క్షుణ్ణంగా తెలిసిన వారే ఈ పనికి పాల్పడి ఉంటారని పార్కులో పనిచేసే సిబ్బంది ప్రమేయం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇందిరా పార్కులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ రాత్రి 10 కాగానే అన్ని లైట్లను ఆర్పివేస్తారు. ఈ విషయాన్ని దొంగలు తమకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ పార్కులో గంధపు చెట్లు ఎక్కడ ఉన్నాయో పార్కులో పనిచేసే సిబ్బందికి మాత్రమే తెలుసని బయటివారికి తెలిసే అవకాశం లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దుండగులు నరికిన గంధపు చెట్ల విలువ దాదాపు రూ. లక్షా 70 వేలు ఉంటుందని సమాచారం.