iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో పారదర్శకత కోసం పట్టుదలతో ప్రయత్నిస్తోంది. ఇసుక ని ఆన్ లైన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను ఇప్పటికే సడలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే తరలించాలనే షరతు కూడా తొలగించారు. నేరుగా ర్యాంపుల వద్ద, కావాల్సిన నాణ్యతలో, కావాల్సినంత ఇసుకను కొనుగోలు చేసేందుకు సామాన్యులకు అనుమతినిచ్చారు. తద్వారా ఇసుక కొరత, అధిక ధరలు, నాణ్యత వంటి సమస్యలకు ఏకకాలంలో పరిష్కారం లభించబోతోంది.
ఇక ఇసుక సరఫరా విషయంలో ఇప్పటికే ప్రభుత్వం స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందితో అమ్మకాలు సాగిస్తోంది. ఇసుక తవ్వకాలను కూడా పర్యవేక్షిస్తోంది. అయితే తాజాగా ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. తద్వారా ఇసుక తవ్వకం విషయంలో అవతకతవకలకు చెక్ పెట్టే సంకల్పంతో సాగుతోంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న మార్పులకు అనుగుణంగా తాజాగా 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. అందులో ఎన్ ఎం డీసీ, ఎంఎంటీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలున్నాయి. వారిలో ఎవరు ముందుకొచ్చినా ఇసుక తవ్వకం, అమ్మకం బాధ్యతను వారి పర్యవేక్షణలో నడపాలని ఆశిస్తోంది. తద్వారా ఇసుకాసురులకు అడ్డకట్ట వేయవచ్చని భావిస్తోంది.
ఏపీ ప్రభుత్వం మైనింగ్ శాఖ తరుపున వివిధ సంస్థలకు లేఖలు పంపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి ఇసుక వ్యవహారాల బాధ్యత అప్పగించబోతున్నారు. కొత్తగా మరిన్ని ర్యాంపులతో పాటుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన పేరుకుపోయిన ఇసుకను కూడా డ్రెడ్జింగ్ చేసే ప్రతిపాదనలున్నాయి. తద్వారా ఇసుక కొరత అనే మాట రాకుండా, అందరికీ అందుబాటులోకి నాణ్యమైన ఇసుకు తీసుకురాగమని చెబుతోంది.
అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలను రంగంలోకి తెస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు మొదలయిన నేపథ్యంలో ఏ ఒక్క సంస్థ ముందుకొచ్చినా వారికి అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇసుక తవ్వకాల్లో వారు సిద్ధమవుతారా లేదా అన్నది సందేహంగా మారింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జవాబు కోసం వేచి చూసి, వారు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే టెండర్ల ప్రక్రియలో ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో కేంద్ర సంస్థలు ఏమేరకు ముందుకొస్తాయన్న దానిని బట్టి ఏపీలో ఇసుక విధానం రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది.