iDreamPost
iDreamPost
మజిలీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకున్న సమంతా కొత్తగా సినిమాలేవీ ఒప్పుకున్నట్టు లేదు కానీ చిన్ని తెరపై మాత్రం ఓ రేంజ్ లో సందడి చేయాలనీ డిసైడ్ అయ్యింది. ఇటీవలే మావయ్య నాగార్జున కోసం బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ని హోస్ట్ చేసి మెప్పించిన సామ్ తాజాగా స్టార్ సెలెబ్రిటీలతో ‘సామ్ జామ్’ పేరుతో టాక్ షో చేయబోతోంది. కాకపోతే అది టీవీ టెలికాస్ట్ కోసం కాదు లెండి. ఆహా యాప్ లో నవంబర్ 13 నుంచి ఎక్స్ క్లూజివ్ గా ఇవి స్ట్రీమ్ కాబోతున్నాయి. ఇటీవలే సుమతో ఇదే తరహాలో ఓ ప్రోగ్రాం చేసింది ఆహా. దానికి స్పందన బాగానే వచ్చింది కానీ మరీ ఆశించిన స్థాయిలో దూసుకుపోలేదు.
అందుకే ఇప్పుడు సమంతాను రంగంలోకి దింపారు. మరో విశేషం ఏంటంటే ఎవరు పాల్గొంటారో కూడా ముందే హింట్ ఇచ్చేశారు. మెగా స్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తమన్నా, రష్మిక మందన్న, నైనా నెహ్వాల్ లతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ముందు ముందు జాయినయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ఎంత నిడివితో ఉంటాయి, అన్నీ ఒకేసారి వస్తాయా లేక ఎపిసోడ్ల వారిగా వారానికి ఒకసారి వస్తారా అనేది ఇంకా వెల్లడించలేదు. చిరంజీవికి ఇలాంటి టాక్ షోలు కొత్త కాదు. గతంలో మంచు లక్ష్మి, సౌందర్యలహరికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ పాల్గొనడమే ఒక రకంగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. నాన్న నడిపే యాప్ కాబట్టి తనవంతుగా చేయూతనిస్తున్నాడు కాబోలు. త్వరలో ఆహా కోసం ఓ పెద్ద ఈవెంట్ కూడా ప్లాన్ చేయబోతున్నట్టు ఇటీవలే తెలిసింది. రాబోయే కొత్త సినిమాల రిలీజులతో పాటు వెబ్ సిరీస్ లు, ఇలాంటి స్పెషల్ ప్రోగ్రాములతో కూడిన షెడ్యూల్ ని అందులో ప్రకటిస్తారట. లోకల్ కంటెంట్ ట్యాగ్ తో మొదలుపెట్టిన ఆహా క్రమంగా మార్కెట్ మీద పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తెలుగు సినిమాలతో పాటు తమిళ మలయాళ డబ్బింగులు, ఇలాంటి ఎక్స్ క్లూజివ్ షోలు ప్లాన్ చేస్తోంది.