Idream media
Idream media
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఏ ఉద్దేశంతో అన్నా.. అది నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చ జోరుగా జరుగుతోంది. “సీఎంగా 40 ఏళ్లు జగనే ఉండాలి” అంటూ ఆ ఎంపీ అభిలాష నెరవేరాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. “పైన తథాస్తు దేవతలు ఉంటారంటారు.. రఘురామ ఆ మాట అన్న వెంటనే వారు తథాస్తు అనే ఉంటారు. రఘురామా.. జగన్ అంటే నీకు ఎంత ప్రేమయ్యా.. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిస్తే ఏమైపోతారో” అని వైసీపీ, జగన్ అభిమానులు సెటైరికల్ గా చేస్తున్న కామెంట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఎంపీ రఘురామ రాజు పరపతి తాజాగా బాగా పెరిగింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే హాట్ టాపిక్ గా మారారు. ఎంతలా అంటే.. త్వరలో ఎంపీ పోస్టు ఊడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనేటంత. ప్రభుత్వంపైన, జగన్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలుమార్లు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఆ విషయాన్ని ఎంపీలు ప్రస్తావించారు. మరోవైపు ఆయన కూడా.. పదవిని కాపాడుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పెద్దలను కూడా కలుస్తున్నారు. అయితే.. సీఐడీ విచారణలో చంద్రబాబుకు, రఘురామకు ఉన్న లింకులు బహిర్గతం కావడంతో కేంద్రంలో రఘురామను నమ్మే పరిస్థితి ఉందా అంటే అనుమానమే.
రఘురామకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య సాగిన వాట్సాప్ చాటింగులు, టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి లోకేష్తో రఘురామకుసాగిన ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో రఘురామ ప్రతిష్ట మరింత దిగజారింది. ఇదే క్రమంలో జగన్ పై చేస్తున్న కుట్రలు బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆయనపై ప్రజల్లో అభిమానం మరింత పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో 40 ఏళ్లు సీఎంగా ఉండాలనే రఘురామ కోరిక తప్పకుండా నెరవేరాలంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జ్యోతిబసు లా జగన్ అలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని మరోవైపు వైసీపీ నేతలు కూడా స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజలకు మేలు చేసే ఇప్పటి వరకూ లేరని, అవే జగన్ కు శ్రీరామ రక్ష అంటున్నారు.
జగన్ కూడా ప్రజాసేవకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నారు. కొవిడ్ కాలంలోనూ జగన్ సంక్షేమ రథం ఆగలేదు. ఒక్క ఏడాదిలోనే సుమారు నలభై ఐదు వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించారు. తాజాగా ఈ ఏడాది కూడా కాపు నేస్తం సొమ్ము మహిళల ఖాతాలో జమ చేశారు. మొదట్లోనే ఆయన సేవలు ఇలా ఉంటే.. మున్ముందు రెట్టింపు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో గత ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ కాలమే జగన్ పాలన ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రఘురామ సెటైరికల్ గా చెప్పినా.. ఆ వ్యాఖ్యలు జగన్ కు అనుకూలంగా మారడమే ఇందుకు నిదర్శనమని సూచిస్తున్నారు. మరి మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది కాలమే చెప్పాలి.