మహాగఠ్ బంధన్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయే
బీహార్ ఎన్నికలైన తరువాత కూడా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి చల్లారినట్టు కనిపించడంలేదు. ఓటమికి గల కారణాలను కూటమిలోని అన్ని పార్టీలను సమీక్షించుకుంటున్న నేపథ్యంలో ఆర్జేడి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందిస్తుంది. ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే తమను దెబ్బ తీసిందని విమర్శల వర్షం కురిపించారు.
70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలో మాత్రమే గెలుపొందడానికి కారణం, కాంగ్రెస్ పార్టీ కాని రాహుల్ గాంధీ కాని ఎక్కడా కూడా మనస్పూర్తిగా పని చేయలేదని, 70 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపిన కాంగ్రెస్ పార్టీ కనీసం 70 బహిరంగ సభలను కూడా నిర్వహించలేదని రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీల్లో మూడు రోజులు మాత్రమే పాల్గొన్నారని, ప్రియాంక గాంధీ అసలు బీహర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. బీహార్ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ తమకు సంబంధం లేనట్టు వ్యవహరించబట్టే తమ కూటమికి ఆ పార్టీ ఒక అడ్డంకిగా మారిందని శివానంద్ తివారీ విమర్శించారు.