కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రయత్నాలు చేయడం ఎప్పటి నుంచో ఉంది. పగ్గాలు ఏ పార్టీ చేపట్టిన దీనిమీద ప్రధానంగా దృష్టి పెడుతూ అడుగులు పడుతూనే ఉన్నా, ఆచరణ సాధ్యం కావడం లేదు . మోదీ ప్రభుత్వం మొదటి విడతలో సైతం నదుల అనుసంధానం దాని ముందు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో తీవ్రమైన చర్చ సాగింది. భారతదేశం లో భిన్నమైన ప్రాంతాల్లో పుట్టి, అంతే భిన్నంగా సాగిపోయే జీవనదులు అన్నిటినీ కలిపితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అన్నది అసలు లక్ష్యం. అయితే దీని మీద ఉన్న అడ్డంకులు ఎదురయ్యే సవాళ్లు గురించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యంగా జాతీయ జల అభివృద్ధి సంస్థ వెల్లడించిన కొన్ని సలహాలను పరిశీలిస్తే దీనిలో అసలు విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా నదుల అనుసంధానంపై 3 ప్రత్యేకమైన సవాళ్ళు ఎదురుగా ఉన్నాయి.
పంపకాలే అసలైన సవాల్
నదులు ప్రవహించే రాష్ట్రాల్లో మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు నదుల అనుసంధానానికి అంగీకరించడం లేదు అన్నది ప్రధానమైన విషయం. నీటిని మళ్ళించే రాష్ట్రం తీసుకునే రాష్ట్రాల మధ్య ఒప్పందం రావడం చాలా కష్టంగా ఉంది. నీరు నదిలో ఎప్పుడూ ఒకే రకంగా పారదు. ఒక్కోసారి హెచ్చుతగ్గులు ఉంటాయి. తగ్గినప్పుడు మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది అనేది కొన్ని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరం. మరోపక్క మిగులు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలించే రాష్ట్రం కూడా అధికంగా నీటిని డిమాండ్ చేస్తోంది. దీంతో పక్క పక్క రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఎంతో కష్టంగా మారుతున్నాయి.
రాష్ట్రాల భయమే రెండో సవాల్
నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరిస్తే ట్రైబ్యునల్ అవార్డులు అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు అవుతాయో లేదో అన్న ఆందోళన అన్ని రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ ట్రైబ్యునల్ మాటలు ఆదేశాలు రాష్ట్రాలు పట్టించుకోకపోతే కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాగు విద్యుత్ అవసరాలకు వినియోగించుకుని నీటి పై వ్యతిరేక ప్రభావం ఉంటుందేమో అన్న భయం కొన్ని రాష్ట్రాలకు బలంగా ఉంది. ఒకవేళ అంతర్రాష్ట్ర ఒప్పందాలు తాము విద్యుత్తు ఉత్పత్తికి వాడుకునే నీటిని సైతం ఒప్పందంలో భాగంగా వదులుకోవాల్సి వస్తే కొన్ని రాష్ట్రాలు ఆ విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉంది. నీటి అవసరాలు గణనీయంగా పెరగడంతో తమది మిగులు వేసి ఉన్న రాష్ట్రం అని మొదట అంగీకరించిన రాష్ట్రాలు కూడా ఎప్పుడూ నదుల అనుసంధానం వైపు ఒప్పుకోవడం లేదు. చేతిలో నీటి అవసరాలు మరింత పెరిగితే నదుల అనుసంధానం వల్ల బేసిన్ రాష్ట్రాలు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నది వారి భయం.
ఇదిగో మూడో సవాల్
నీటి లభ్యత తక్కువగా ఉన్న పరివాహక ప్రాంతం నుంచి లభ్యతే లేని పరివాహక ప్రాంతానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి ని మళ్లించడం పై ప్రత్యేకంగా అనుమతించడం లేదా నిరోధించడం న్యాయపరమైన ఇప్పటివరకు లేదు. అయితే కొన్ని ప్రత్యేక ఒప్పందాలు ఇరు రాష్ట్రాల మధ్య జరిగే అవగాహన లేదా ఒక పరివాహక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీటి మళ్లింపు జరిగింది. వీటినే అంతర్రాష్ట్ర ఒప్పందాలు లేదా ట్రైబ్యునల్ తీర్పును గా చెబుతున్నారు. మరి న్యాయపరంగా ఒక వ్యూహాత్మకమైన చట్టాలు తీర్పులు లేకపోతే భవిష్యత్తులో నీటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే అది దేశ సమైక్యతకు భంగం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఇది మొత్తం దేశం భద్రతకు సంబంధించిన విషయం గా మారుతుంది.
ట్రైబ్యునల్ చెప్పిన… ఒప్పందం ఆదుకుంది!
నదుల అనుసంధానం విషయంలో ఎదురయ్యే సవాలు లో ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గురించి చెప్పుకోవాలి. కృష్ణ బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని మళ్లించి ఆయకట్టును సంరక్షించాలి లేదా అలా చేస్తే ఏ మేరకు చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై బచావత్ ట్రిబ్యునల్ ముందు చర్చ జరిగింది. దీనికి కర్ణాటక అంగీకరించలేదు. కృష్ణా పరివాహక ప్రాంతం అధికంగా ఉండే కర్ణాటక మిగులు జలాలు ఎక్కువ. దీంతో బచావత్ ట్రిబ్యునల్ ను, సూచనను వినేందుకు సైతం కర్ణాటక ఆసక్తి చూపలేదు. అయితే చివరకు కొన్నిపరిమితులతో కృష్ణ బేసిన్ నుంచి పక్క బేసిన్కు నీటి మళ్లింపు నకు ట్రైబ్యునల్ అంగీకారం తెలిపింది.
నర్మదా లో సైతం
అలాగే నర్మదా జలాల్లో భాగస్వామ్యం కానీ రాజస్థాన్కు నీటిని కోరే హక్కు లేదని ట్రైబ్యునల్ పేర్కొంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ద్వారా నీటిని రాజస్థాన్కు కేటాయించారు. ఇలా నీటి పంపిణీ విషయంలో ప్రతి సారి గొడవలు రావడం దానికి ప్రత్యేకమైన చట్టాలు లేకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు నదుల అనుసంధానం విషయంలోనూ ముందుకు వెళ్లేందుకు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏం జరుగుతాయి అన్న అంశం మీదే కేంద్రం ప్రధానంగా భయపడుతోంది. నీటి పంపిణీ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అది మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వచ్చే అంశం అవుతుంది కాబట్టి కేంద్రం అడుగులు మెల్లగా పడుతున్నాయి.
ఆంధ్ర లో జరిగింది నిధుల మేత
నదుల అనుసంధానం విషయంలో చంద్రబాబు చేసుకున్న ప్రచారం అంతా బూటకమని జాతీయ జల అభివృద్ధి సంస్థ తన నివేదికలో తెలిపింది. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశామని పట్టిసీమ కట్టమంటూ సుమారు 1500 కోట్ల అవినీతికి తెరలేపిన చంద్రబాబు దానిని బూచిగా చూపి నిధులను మేసారు. అప్పట్లో తన అనుకూల మీడియా చేత గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ప్రచారం చేయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు బూటకం అని తాజా నివేదిక బయటపెట్టినట్లు అయింది.